అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు రాకేష్ తికాయిత్: చలసాని శ్రీనివాస్: పవన్ కల్యాణ్ కూడా
తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. రాయలసీమలో ప్రవేశించిందీ పాదయాత్ర. ఇంకో అయిదు రోజుల్లో ఈ పాదయాత్ర ముగియబోతోంది. టెంపుల్ సిటీ తిరుపతిలో ముగింపు సభను ఘనంగా నిర్వహించడానికి అమరావతి ప్రాంత రైతులు సమాయాత్తమౌతున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.

అన్ని పార్టీల మద్దతు..
ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తమ ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలనేది అమరావతి ప్రాంత రైతుల ఉద్దేశం. ఈ పాదయాత్ర ముగింపుసభ.. అటు రాజకీయంగానూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నెల 17వ తేదీన ముగింపు సభ జరుగనుంది. దీన్ని విజయవంతం చేయడానికి వైసీపీయేతర పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన, సీపీఐ, సీపీఎం ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి.

ముగింపు సభకు హేమాహేమీలు..
ఆయా పార్టీల నాయకులందరూ దశలవారీగా పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావాన్ని తెలిపారు. వారికి నైతిక మద్దతును ప్రకటించారు. ఆయా పార్టీల నేతలందరూ ముగింపు సభకూ హాజరు కానుండటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ నుంచి సోము వీర్రాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం నేత నారాయణ పాల్గొనే అవకాశం ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పాల్గొంటారని చెబుతున్నారు.

రాకేష్ తికాయిత్, యదువీర్ సింగ్
ఇప్పుడు కొత్తగా మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించే పాదయాత్ర ముగింపు సభకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరవుతారనే ప్రచారం సాగుతోంది. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయిత్, యధువీర్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వారిని తాము ఆహ్వానించగా.. రాకేష్ తికాయిత్, యధువీర్ సింగ్ అంగీకరించినట్లు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు.
Recommended Video

సభకు అనుమతి ఇవ్వాలి..
ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఆ ఇద్దరు రైతు నేతలు తిరుపతి బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహించ తలపెట్టిన తిరుపతి పాదయాత్ర ముగింపుసభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని చలసాని శ్రీనివాస్ తప్పు పట్టారు. రైతులు తమ ఆకాంక్షలను బలంగా వినిపించుకోవడానికి ప్రజాస్వామ్యం అవకాశం ఇచ్చిందని, సభను అడ్డుకోవాలని భావించడం సమర్థనీయం కాదని చెప్పారు. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు దీనిపై స్పందించాలని అన్నారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి..
అమరావతి ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయట్లేదని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఏపీ హైకోర్టులో కేసు విచారణలో ఉందని, సానుకూలంగా తీర్పు వస్తే జస్టిస్ చంద్రు మళ్లీ ఏదో ఒక వ్యాఖ్యలు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ లోపే ప్రభుత్వంతో మాట్లాడి తిరుపతి బహిరంగ సభకు అనుమతి ఇప్పించాలని చలసాని శ్రీనివాస్ కోరారు. ప్రజాస్వామ్య హక్కుని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి అన్ని వర్గాల ప్రజలు నివాసముండే గొప్ప ప్రజారాజధానిగా వర్ధిల్లాలని అన్నారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications