ఎర్రచందనం: బొజ్జల సంచలన వ్యాఖ్య, జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శేషాచలం అడవుల నుండి జరిగిన అక్రమ రవాణా వెనుక ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జడ్పీటీసీ సభ్యులతో పాటు బడాబాబులు ఎంతోమంది ఉన్నార్నారు.
ఎర్రచందనం కేసుల నుండి తప్పించుకునేందుకు వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి వారిని తాము పార్టీలో చేరనిచ్చేది లేదన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాల్లో ఎంతటి వారున్నా ఉపేక్షఇంచమని, వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకు రావాలని ఏఫీ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.

ప్రస్తుత చట్టంలో ఉన్న కొన్ని లోపాలను స్మగ్లర్లు ఆశరాగా చేసుకొని చెలరేగిపోతున్నారని, వారిని కట్టడి చేసేందుకు చట్టాన్ని మరింత కఠినం చేస్తామన్నారు. దీని కోసం అటవీ చట్టానికి సవరణ తెస్తామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందువల్ల తొలుత ఆర్డినెన్స్ జారీ చేస్తామన్నారు. ఎర్రచందనం రెండో విడత వేలం ప్రకటన మూణ్ణాలుగు రోజుల్లో ఉంటుందని చెప్పారు.
కేసు విచారణ వాయిదా
కాగా, శేషాచలం ఎన్‌కౌంటర్ కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 6గురు స్మగ్లర్ల రీపోస్టుమార్టం రిపోర్టును హైకోర్టు పరిశీలించింది.
భోగాపురం విమానాశ్రయంపై జగన్ ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయం అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేసే పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications