అధికారుల నిర్లక్ష్యం: ఐశ్వర్యరాయ్ కేరాఫ్ గుంటూరు జిల్లా
అమరావతి: అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కేరాఫ్ గుంటూరు జిల్లాగా మారింది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ హెల్త్ కార్డుల జారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల పేరిట హెల్త్ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఈ హెల్త్ కార్డులో లబ్ధిదారుల ఫోటోకు బదులు హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఫోటోను పెట్టారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు మారు పేరుతో హెల్త్ కార్డు మంజూరైంది. అయితే, ఆ హెల్త్ కార్డులో లబ్ధిదారుల పేర్లు ఉన్నప్పటికీ, వారి ఫ్యామిలీ ఫొటో మాత్రం లేదు. కుటుంబ ఫోటో ఉండావల్సిన స్థానంలో ఐశ్వర్యారాయ్ ఫొటోను అధికారులు ఉంచారు.

దీంతో, సదరు లబ్ధిదారులు ఆశ్చర్యపోయారు. తమ ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి ఫొటో రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ధానికులు సైతం హెల్త్ కార్డుల జారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే తమ ఫోటోకు బదులు ఐశ్వర్యరాయ్ ఫోటో పెడతారంటూ అధికారుల తీరుపై బాణావత్ బాద్యు కుటుంబం మొదలుకుని స్థానికులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications