రజినీకాంత్ కు టీకప్పులు మోసిన చరిత్ర మర్చిపోయావా.. కొడాలి నాని!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా రజినీకాంత్ రావడం, ఆయన చంద్రబాబును ఉద్దేశించి ప్రశంసించడం ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రజినీకాంత్ ని టార్గెట్ చేసి వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రజినీకాంత్ ఏపీలో రాజకీయ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన తన వ్యాఖ్యలతో జీరో అయ్యారని పేర్కొన్నారు.
ఇక వైఎస్ఆర్సిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నేతలు తమ దైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా రజినీకాంత్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వైసిపి నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజనీకాంత్ ను విమర్శించినట్టు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు బోండా ఉమ.

ఏపీకి వచ్చి మాట్లాడిన సూపర్ స్టార్ రజినీకాంత్ పై ఇక్కడ మంత్రులు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను, తమిళనాడుకి వెళ్లి చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. తలైవా రజనీకాంత్ పై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. అవసరమైతే తమిళనాడు వెళ్లడానికి వైసీపీ నేతలకు తానే కార్లు పెడతానంటూ పేర్కొన్నారు. వైసీపీ నేతల దమ్ము అక్కడ చూపించాలన్నారు.
వైసీపీ ప్రభుత్వంపైన విమర్శలు చెయ్యకున్నా రజినీకాంత్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని రజనీకాంత్ కు టీ కప్పులు అందించిన చరిత్రను మరిచిపోయి మాట్లాడుతున్నాడని బోండా ఉమ సెటైర్లు వేశారు. ఇక జనసేన టీడీపీ పొత్తులపైన వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు భయపడుతున్నారన్నారు. ఇంకా పొత్తు ఖరారు కాకముందే వైసీపీ నేతలకు ఎందుకు అంత ఉలుకు అంటూ ప్రశ్నించారు. ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని బోండా ఉమా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications