ఉత్కంఠకు తెర.. కోర్టు షాక్ తో జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసిపి నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు లొంగిపోయాడు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయారు.
రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
తన తల్లి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ గడువు నిన్న సాయంత్రం తో ముగియడంతో అతను లొంగిపోతాడా లేదా అన్నది సర్వత్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయారు .తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

బెయిల్ పొడిగించే ప్రసక్తే లేదని షాక్ ఇచ్చిన కోర్టు
ఇక మద్యంతర బెయిల్ ని పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు రాజమహేంద్రవరం కేంద్రకారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేయగా, బోరుగడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు.
నకిలీ మెడికల్ సర్టిఫికెట్ తో బోరుగడ్డ అనిల్ బెయిల్
టిడిపి నేతలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్టు, అనుచితంగా దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నారు బోరుగడ్డ అనిల్. అయితే ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల బెయిల్ పొందాడు. దీనికోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు.
బెయిల్ పొడిగించుకోవటం కోసం బోరుగడ్డ అనిల్ అడ్డదారులు
నకిలీ పత్రాలతో ఈ నెల 1వ తేదీన బోరుగడ్డ అనిల్ మద్యంతర బెయిల్ ను పొడిగించుకున్నారు. దీనిని మరో మారు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయగా హైకోర్టు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో ఆయన రాజమహేంద్రవరం జైలులో లొంగి పోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications