ఏపీలో టీటీడీ ఆస్తులు, పోర్టులపై కన్నేసిన తెలంగాణ- తేల్చేసిన మాజీ మంత్రి
Chandrababu Naidu- Revanth Reddy meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించబోతోన్నారు. నేడు దీనికి ముహూర్తం. ఈ సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. బేగంపేట్‌లోని ప్రజాభవన్ దీనికి వేదిక.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరభ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారితో పాటు ఆర్థికం, జలవనరులు, విద్యుత్, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు.

విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేసిన విషయం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.
ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ హోదాలో హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి.
1,000 కిలో మీటర్ల మేర విస్తరించివున్న ఏపీ కోస్తా తీరంలో తెలంగాణకూ వాటా కావాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో నిర్మితమౌతోన్న పోర్టుల్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఓడరేవుల్లో తెలంగాణకు వాటా కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోన్నట్లు సమాచారం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులు, బోర్డు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో కూడా తెలంగాణకు వాటా కావాలంటూ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు- రేవంత్ రెడ్డి భేటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తోన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. పారదర్శకత, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications