నిర్ణయం అయిపోయిందా - చంద్రబాబు తేల్చాలి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ హాయంలో నిర్మాణం చేసిన ఋషి కొండను సందర్శించారు. గుంతలు లేని రోడ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ వస్తుందని ప్రకటించారు. త్వరలోనే 52 ఎకరాల్లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన వేళ మాజీ మంత్రి బొత్సా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
చంద్రబాబు స్పందించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో, విధానమేంటో స్పష్టం చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ప్లాంట్‌కు సంబంధించి వేగంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, పండుగ బోనస్ ఇవ్వక పోవడం, బలవంతపు వీఆర్‌ఎస్ అమలు చేస్తుండటం, బ్లాస్ట్ ఫర్నేస్‌లు వరుసగా మూసి వేస్తుండటం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని బొత్సా వ్యాఖ్యానించారు.

నిర్ణయం జరిగిందా
విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా? కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారా? సెయిల్‌లో విలీనం చేస్తారా?. అసలు ఏం చేయబోతున్నారు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బొత్సా డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యే పెట్టేలా, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతూ రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అనుసరిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉపేక్షించబోరని బొత్సా హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదన్న బొత్స.. ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు అనే నినాదంతో ఉన్న సెంటిమెంట్‌కు భంగం కలిగించే పనిలో భాగం కావొద్దని సూచించారు.
చర్యలు ఏవి
జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల తొలగింపు, ఫర్నేస్‌ల మూసివేత, వీఆర్‌ఎస్ ఇవ్వడం వంటివి చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. నాడు కేంద్ర ప్రభుత్వ కూటమిలో లేకపోయినా, స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీని డిమాండ్ చేసే స్థాయిలో ఉందని గుర్తు చేశారు. విశాఖ డెయిరీ చరిత్రలో రైతుల నుంచి సేకరించే పాల ధరలు పెంచడమే కానీ, ఏనాడూ తగ్గించడం లేదని మండలి విపక్షనేత గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. విశాఖ డెయిరీ పాల సేకరణ ధర తగ్గిస్తే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications