అడ్డంగా: బొత్స, బాబుకు కాళరాత్రులే: రఘువీరా
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో ఫోన్ సంభాషణతో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడన్నారు.
చంద్రబాబు తెలంగాణలో ఒక మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతారని చెప్పారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, చంద్రబాబు సాధించి పెట్టకపోతే మిగతా నాలుగేళ్ల పాలన కాళరాత్రులేనని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు పరిశ్రమ, ప్రాజెక్టులపై రఘువీరారెడ్డి అధ్యక్షతన ఆదివారం కడపలో సదస్సు జరిగింది.
కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్, పార్టీ నేతలు అహ్మదుల్లా, శైలజానాథ్, తులసిరెడ్డి, సి.రామచంద్రయ్య, బత్యాల చెంగల్‌రాయులు తదితరులు పాల్గొన్న ఈ సదస్సులో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు పరిశ్రమ, ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమాలకు 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసిందన్నారు. ఆ చట్టంలో ఉన్నవాటిని సాధించి పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications