ఎందుకీ గందరగోళం: 'గుట్టు విప్పి 24 గంటలు, చంద్రబాబు నోరు విప్పలేదు'
అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ తుంగలో తొక్కిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అసలు ప్రత్యేకహోదా విషయంలో ఇంతటి గందరగోళం ఎందుకు ఏర్పడిందని ఆయన టీడీపీని ప్రశ్నించారు. హోదా విషయంలో టీడీపీ-బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి ఎక్కడెక్కడో పర్యటనలు చేస్తున్నారని, ఆయన ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే స్పష్టత కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. 'స్విట్జర్లాండ్ వెళ్లారని ఒకరు చెబుతారు, మరో చోటుకి వెళ్లారని ఒకరు చెబుతారు' అని అన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోసం టీడీపీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టత ఇచ్చి చంద్రబాబు గుట్టు విప్పి 24 గంటలైనా, ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం నోరు విప్పలేదని అన్నారు.
ప్రాజెక్టుల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే మిన్నకున్నారన్నారు. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులంటూ తెలంగాణ నీళ్లు దోచుకుంటుంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబు ఎప్పుడూ తమ వద్ద ప్రత్యేకహోదా విషయాన్ని ప్రస్తావించ లేదని చెప్తున్నారని, చంద్రబాబు కావాలనే ప్రత్యేకహోదా అంశాన్ని అవసరం లేదని చెప్పారని అన్నారు. ప్రత్యేకహోదా, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications