బాలకృష్ణ "పుడింగి" అనుకుంటున్నాడా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వివాదంపై వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించడం రాజకీయ వేడిని మరింత పెంచింది.
బాలకృష్ణ ప్రదర్శిస్తున్న అహంకారంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏం చూసుకుని అంత అహంభావం ప్రదర్శిస్తున్నారు? అంటూ బొత్స నిలదీశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని (జగన్), ఒక అగ్ర కథానాయకుడిని(చిరంజీవి)ని ఉద్దేశించి సభలో ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని బొత్స ప్రశ్నించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై జనసేన పార్టీ , టీడీపీ మౌనంగా ఉండటాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవిని అన్ని మాటలు అంటుంటే జనసేన పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా, బాలకృష్ణ సొంత పార్టీ అయిన టీడీపీ కూడా ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని బొత్స ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేక అజెండా ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
శాసనసభ స్పీకర్‌పైనా బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే శాసనసభ స్పీకర్, బాలకృష్ణ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు? అని సూటిగా అడిగారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తేలాలి అని బొత్స డిమాండ్ చేశారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీశాయి. ఈ వివాదంపై టీడీపీ, జనసేన పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications