చంద్రబాబూ! ఎయిర్‌ఏషియా స్కాంలో విచారణ కోరగలరా?: బొత్స సవాల్, ‘టీడీపీ ఎంపీల పరారీ’
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని బొత్స నిలదీశారు. పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణకు చంద్రబాబు సిద్ధమేనా? అని సవాల్ ప్రశ్నించారు.

బాబూ విచారణ కోరగలరా?
ఎయిర్ ఏషియా స్కామ్‌లో కేంద్రాన్ని విచారణ కోరగలరా? అని బొత్స సవాల్ విసిరారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో బీహార్‌ను మించిపోయిందన్నారు. ఏపీలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మట్టి, ఇసుక, మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా రోడ్డుపైకి తెచ్చారని ప్రభుత్వంపై బొత్స సత్య సత్యనారాయణ ధ్వజమెత్తారు.

జగన్ పాదయాత్రపై తప్పుడు ప్రచారం
ఇది ఇలా ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా చంద్రబాబు సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్రలో ఎక్కడ తొక్కిసలాట జరగలేదు.. జరిగే అవకాశం లేదని చెప్పారు. అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఇలా పాదయాత్రపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజమండ్రిలో పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టంగా నిలువనుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

డ్రామాలు ఆడుతుంది ఎవరు?
జూన్ 12వ తేదీ పశ్చిమగోదావరి జిల్లా నుంచి జననేత పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. రోడ్డు కం రైలు వంతెన మీదుగా పాదయాత్ర రాజమండ్రి చేరుకుంటుంది. గోదావరి బ్రిడ్జిపై వైయస్ జగన్ పాదయాత్రకు మొదట నిరాకరించి, ఆ తర్వాత షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీతీరు పై ఎంపీ నిప్పులు చెరిగారు. డ్రామాలు ఆడుతుంది మేమా.. టీడీపీనా అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశామని తెలిపారు.

టీడీపీ ఎంపీలు పారిపోయారు
ఎన్టీఏపై వైయస్సార్‌సీపీనే అవిశ్వాసం తీర్మానం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టాడని అన్నారు. హోదా కోసం మాతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీని కోరినా.. టీడీపీలు ఎంపీలు పారిపోయారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.

టీడీపీ ఎంపీలూ.. హోదా కోసం ఏం చేస్తారు?
అసలు హోదా కోసం టీడీపీ ఎంపీలు ఇప్పుడేం చేస్తారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ సుబ్బారెడ్డి నిలదీశారు. ‘ఉప ఎన్నికలు రావాలని వంద శాతం కోరుకుంటున్నాం. ఉప ఎన్నికలు వస్తే మా రాజీనామాలకు విలువ ఉంటుంది. ఇప్పటికైనా హోదా కోసం రాజీనామాలు చేయాలని టీడీపీ కోరుతున్నాం. స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక మా రాజీనామాలు ఆమోదించాల్సిందే' అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.