బ్రహ్మోత్సవాలకు తిరుపతి ముస్తాబు- నేడు ప్రధాన ఘట్టం
ఈ నెల 15వ తేదీన మహా శివరాత్రి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఉత్సవాల కోసం తిరుపతి ముస్తాబు అవుతోంది. లక్షలాదిమంది భక్తులు కపిలతీర్థాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, బాదంపాలు నిరంతరాయంగా అందించాలని అన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అదేవిధంగా ఆలయంలో పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని, ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోళీలు, విద్యుత్, పుష్పాలంకరణలు చేయాలని చెప్పారు. స్వామివారి వాహనాల మరమ్మత్తులు, పటిష్టంగా క్యూలైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాగా- శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నేడు తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications