స్థానిక సమరానికి సై అంటున్న ఏపీ.. ఎన్నికలసంఘం కీలకనిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
తాజా సర్ తుది జాబితాతో సంబంధం లేకుండా ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలు అక్టోబర్ 3వ తేదీన ప్రచురితమవుతాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేస్తే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

2025 నాటి జాబితాతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం
ఈ క్రమంలోనే సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి జాబితాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్టోబర్లో ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పురపాలక, నగర పంచాయతీలలో, నగరపాలక సంస్థ ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాలో ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు.
జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశం
ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం మునిసిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా, ఇప్పటివరకు జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయితీలలో ఈనెల 17వ తేదీలోగా జాబితా ప్రచురణ పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలు ఎంపిక, ప్రచురణ ప్రక్రియను ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తం
ఎన్నికల సిబ్బందికి శిక్షణలతో పాటు, 30 నుండి 35 రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించింది. ఇతర రాష్ట్రాలతో బ్యాలెట్ బాక్సుల కోసం, ఎన్నికల సామాగ్రి కోసం ఇప్పటికే సంప్రదింపులు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్న క్రమంలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications