తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని వారికి దర్శనం కోసం 22 గంట ల సమయం పడుతోంది. దీంతో.. భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక విజ్ఞప్తి చేసారు. అదే సమయంలో నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం, వసతి కోటా విడుదల పైనా ప్రకటన చేసింది. రద్దీ సమయంలో సహకరించాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతున్న వేళ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అయితే, భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను ముందుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. దర్శన సమయంలో సంయమనం పాటిస్తూ, టీటీడీ సిబ్బందికి సహకరించాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. నవంబర్ నెలకు సంబంధించి దర్శనాలు.. వసతి కోటా విడుదల పైన టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మా రాధన సేవ) కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. కాగా.. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

భక్తులకు దర్శనం.. వసతి
ఇక.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి న కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద ల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications