ఏపీలో కీలక అడుగు వేసిన బీఆర్ఎస్ - టార్గెట్ ఫిక్స్..!!
ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఏపీలో విస్తరణ దిశగా చర్చలు జరిగాయి. ఏపీ పార్టీ అధ్యక్షుడిని నియమించారు. కొందరు నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఏపీలో కేసీఆర్ సభ ఏర్పాటు చేసి రాజధాని అంశంతో పాటుగా ప్రత్యేక హోదా పైన స్పష్టత ఇస్తామని ప్రకటించారు. అమరావతికి మద్దతుగా బీఆర్ఎస్ ఏపీ నేతలు ప్రకటనలు చేసారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభించారు.
ఏపీపై బీఆర్ఎస్ ఫోకస్: తెలంగాణ తరువాత బీఆర్ఎస్ మహారాష్ట్ర, ఏపీ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ లో బిడ్ సమయంలో బీఆర్ఎస్ పాత్ర పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కార్మికులకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. కానీ, చివరకి టెండర్ దాఖలు చేయలేదు. పోలవరం విషమం పైన తెలంగాణ మంత్రులు విమర్శలు చేసారు. ఏపీలో మూడు రాజధానుల వివాదం కొనసాగుతున్న సమయంలో అమరావతికి మద్దతుగా ఏపీ బీఆర్ఎస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖలో కేసీఆర్ సభ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జూన్ రెండో వారంలో విశాఖలో సభ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ ఏపీలో సిద్దం అవుతోంది.

పార్టీ కార్యాలయం ప్రారంభం: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కార్యాలయం ప్రారంభ సమయంలో తమ అజెండా స్పష్టం చేసారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయని ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 5 అంతస్థుల భవనంలో మొదటి అంతస్థులో కార్యకర్తలతో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడు అంతస్థుల్లో పరిపాలన విభాగాలను సిద్ధం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అతిధులు కూర్చోనే విధంగా విశాలమైన స్థలంలో హాలు ఏర్పాటు చేశారు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బిఆర్ఎస్ వల్లనే అవుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

ఏపీలో పాలనపై విమర్శలు: బీజేపీ కి దేశంలో ఎదురు గాలి వీస్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల ను అభివృద్ధి లో నడిపించాలనే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారని చెప్పారు. ఏపీ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదని విమర్శించారు. నిత్యావసర ధరలు ఏపీ లో ఆకాశాన్నంటే విధంగా ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. కేంద్ర నుండి మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని చెప్పారు. ఏపీ లో ఉన్న వనరులు తెలంగాణాలో లేవు..అయినా అభివృద్ధిలో ముందుందని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications