జగన్‌కు 11 సీట్లే రావడానికి కారణం చెప్పిన బుద్ధా వెంకన్న
Buddha Venkanna: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. అమరావతి జోలికి వెళ్లడం వల్లే జగన్ ఓటమిపాలయ్యారని మండిపడ్డారు. అమరావతి విధ్వంసానికి కారకుడు ఆయనేనని ఆరోపించారు.
విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను సైకోగా అభివర్ణించారు. తాను సైకో అని జగన్ మరోసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎదగనివ్వలేదని, ఉద్దేశపూరంగా దాన్ని చంపేశాడని అన్నారు.

ఆ అవకాశం శాసన మండలిలో లేకపోవడం వల్ల దాన్ని రద్దు చేయడానికి సైతం పూనుకున్నాడని బుద్ధా వెంకన్న అన్నారు. రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేసుకోలేక పోయాడని వ్యాఖ్యానించారు. అప్పట్లో మండలి సభ్యుడిగా తాను సభలో ఉన్నానని గుర్తు చేశారు. తనతో పాటు సీ రామచంద్రయ్య వంటి సీనియర్లు సభలో ఉన్నారని పేర్కొన్నారు.
అప్పట్లో తమకు శాసనమండలిలో బలం ఉండేదని చెప్పుకొచ్చారు. అమరావతిని రాజధానిగా రద్దు చేస్తూ అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని తామందరం కలిసి శాసన మండలిలో ఓడించామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఇప్పుడు అదే శాసన మండలిలో తనకు బలం ఉందని వైఎస్ జగన్ చిలక పలుకులు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
అయిదు సంవత్సరాల పాటు జగన్ కళ్లు మూసుకుని పని చేశాడని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కళ్లు తెరిచి పని చేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా లభించేదని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా పాలన చేశాడని అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారాయన. సీ రామచంద్రయ్య, ఇక్బాల్, వంశీకృష్ణ యాదవ్.. వంటి అయిదు మంది ఎమ్మెల్సీలు జగన్‌ను వద్దనుకుని బయటికి వచ్చారని అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి జగన్ వేధింపులకు గురి చేశారని, ఇదంతా అయిదేళ్ల పాటు ప్రజలు గమనించారని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు అన్ని హామీలను నెరవేర్చుతున్నారని, ప్రజలు శాశ్వతంగా జగన్‌ను అధికారానికి దూరం పెడతారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications