అనకాపల్లి వైసీపీ లోక్‌సభ అభ్యర్థి ఖరార్: జగన్ మార్క్ సెలెక్షన్
Budi Mutyala Naidu: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.
దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర పనుల్లో తీరిక లేకుండా గడుపుతోంది వైఎస్ఆర్సీపీ. గడువు సమీపిస్తోండటంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించి దలిచిన బహిరంగ సభ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం ఈ ఒక్క నియోజకవర్గమే పెండింగ్‌లో ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 174 అసెంబ్లీ, 24 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎంపికయ్యారు గానీ.. అనకాపల్లి ఒక్కటే ఖాళీగా పెట్టింది. సరైన అభ్యర్థి కోసం అన్వేషించడంలో భాగంగా ఈ ఒక్క సీటును పెండింగ్ పెట్టింది.
ఇప్పుడు ఈ నియోజకవర్గం అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడను అనకాపల్లి లోక్‌సభ బరిలో దింపింది. ఆయన పేరును పార్టీ అగ్రనాయకత్వం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మాడుగుల అసెంబ్లీ టికెట్‌ను ముత్యాలనాయుడు కుమార్తె ఈర్ల అనూరాధకు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడిని అనకాపల్లి లోక్‌సభకు ఎంపిక చేయడం.. దాని పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటుబ్యాంకుపై సానుకూల ప్రభావం పడుతుందని వైసీపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications