కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు
మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కృష్ణా: మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు(ఏపీ02 టీసీ7146) కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది.

సహాయక చర్యలు
జాతీయ రహదారి వంతెనపై డివైడర్‌ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరుక్కుపోయిన బస్సు..
పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్థులు క్షతగాత్రులను రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది.

బస్సులోనే మృతదేహాలు..
అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, పలువురు ప్రయాణికులు ఇంకా బస్సులోనే ఇరుక్కుని ఉండటంతో గ్యాస్ కట్టర్ల సాయంలో బస్సు భాగాలను వేరుచేసి వారిని బయటకు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి చినరాజప్ప ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

జగన్ పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించారు. కాగా, దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయచర్యలు చురుగ్గా చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఘటనా స్థలంలో జగన్..
ప్రమాద ఘటనా స్థలాన్ని వైయస్ జగన్ పరిశీలించారు. కాగా, రోడ్డుప్రమాదంపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతదేహాలకు సాధ్యమైనంత త్వరగా శవపరీక్ష నిర్వహించి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications