బావి అంచున బస్సు...తృటిలో తప్పిన పెను ముప్పు...అనంతపురంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాసింగ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును బైకుపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టబోయాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమై అతన్ని తప్పించేందుకు స్టీరింగ్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కన పాదచారులను రాసుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న పెద్ద నేల బావి వైపు దూసుకెళ్లింది.
సుమారు 100 అడుగుల లోతున్న నేల బావిని గమనించిన ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి నిలువరించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే బస్సు ముందు భాగం బావి అంచులోకి ప్రవేశించినా ఇంకా ముందుకు వెళ్లకుండా నిలువరించడంలో సఫలీకృతుడయ్యాడు. బావి అంచున బస్సు ఆగినప్పటికి ప్రయాణికులు దిగే క్రమంలో బస్సు మరలా బావిలోకి జారి పోయే ప్రమాదం ఉండటంతో అరగంట పాటు బస్సుని ముందుకు పోకుండా నిలువరిస్తూనే ఉన్నాడు.

స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి ప్రయాణికులందరిని క్షేమంగా కిందకి దింపేంతవరకు బస్సును నిలువరిస్తూనే ఉన్నాడు. దీంతో ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బైట పడటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు దూసుకువెళ్లిన తరుణంలో వెంకటరాముడు (65) అనే పాదచారుడు మృతిచెందగా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 79 మంది ప్రయాణికులుండటం గమనార్హం. వీరిలో 15 మంది విద్యార్థులతో పాటు 30 మంది గర్భిణులు ఉండటం గమనార్హం.

బస్సు డ్రైవర్ కు ప్రశంసలు...
అత్యంత విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించి 79 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవరు చంద్రశేఖర్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. తనకేమైనా ఫర్వాలేదనుకున్నానని, మెయిన్ బ్రేక్, హ్యాండ్‌బ్రేక్ వేసినా బస్సు 30 అడుగుల దూరం బస్సు దూసుకుపోయిందని డ్రైవరు చంద్రశేఖర్ చెప్పాడు. అయితే తన ప్రయత్నానికి చేతి బోరు రూపంలో అదృష్టం తోడవడంతో , ఆ చేతి బోరు బస్సు వెనుక డోర్‌కు తగులుకోవడం వల్ల అందరి ప్రాణాలు నిలిచాయని తెలిపాడు.












Click it and Unblock the Notifications