సింధుతో బైరెడ్డి సమావేశం- నెక్ట్స్ టార్గెట్ అదే: సీఎం జగన్ హామీ వెనుక..!!
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్దార్దరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన సిద్దార్ధ రెడ్డికి శాప్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. 2019 ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. సిద్దార్ధను తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అదే అమలు చేసారు. బైరెడ్డి వయసు..అనుభవం కాకుండా.. ఆయన పని తీరునే ప్రామాణికంగా తీసుకున్నారు.

శాప్ ఛైర్మన్ గా బాధ్యతల స్వీకరణ..
బైరెడ్డికి ఉన్న అభిమానం గుర్తించారు. జగన్ ఏం చెప్పారో..అదే చేసారు. సిద్దార్ధ రెడ్డికి వయసుకు తగిన పదవి కట్టబెట్టారు. ఈ రోజు ఆయన విజయవాడలో శాప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే శాప్ ఛైర్మన్ హోదాలో బైరెడ్డి నేరుగా పీవీ సింధును కలిసారు. ఒలింపిక్స్ లో పతకం సాధించటం పట్ల అభినందించారు.
ఛైర్మన్ హోదాలో సింధుతో భేటీ..
ఒలంపిక్స్ లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన సింధు గారు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని అన్నారు. ఏపీలో బ్యాట్మింటన్ స్టేడియం నిర్మాణం పైన చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఈ స్టేడియం నిర్మాణానికి సింధు అంగీకారం తెలిపారు. దీంతో..దీని పైన త్వరలోనే పూర్తి స్థాయి లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే, అప్పుడే బైరెడ్డి అభిమానులు వచ్చే ఎన్నికల గురించి జోస్యం చెబుతున్నారు.
అభిమానుల భారీ అంచనాలు..
వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా బైరెడ్డికి సీఎం జగన్ తగిన గుర్తింపు ఇస్తారని ప్రమాణ స్వీకార సమయంలో చెప్పుకొచ్చారు. బైరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యే అవ్వటమే అంటూ ధీమాగా చెబుతున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాధ్ రెడ్డితో పాటుగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అయితే, నందికొట్కూరు రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్దర్ తో బైరెడ్డికి విభేధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అయితే, బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అక్కడ ఇప్పుడు వైసీపీ ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్నారు.

జగన్ మద్దతుందనే ధీమా..ఎవరినీ లెక్క చేయకుండా..
సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేధాలు ఉన్నా..అధినాయకత్వం బైరెడ్డిని పక్కన పెట్టలేని పరిస్థితి. బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్..వాగ్దాటి.. యాస - భాష..ముఖ్యంగా యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ప్లస్ పాయింట్స్ గా మారాయి. రాజకీయంగా దూకుడుగా ఉండే బైరెడ్డికి బలం అదే..బలహీనత అదే. రాజకీయాల్లో నాకున్న ఒకే ఒక ధైర్యం జగన్ అని చెబుతూ..తన నియోజకవర్గం నేతలను- జిల్లా నాయకులను లెక్క చేయరనే విమర్శ ఉంది. ఇక, ఇప్పుడు శాప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించటంతో..సీఎం జగన్ - మంత్రి అవంతిని కలిసేందుకు బైరడ్డి అప్పాయింట్ మెంట్ కోరినట్లుగా సమాచారం.

రాజకీయ భవిష్యత్ కు పునాదిగా..
కడప క్రికెట్ స్టేడియంతో పాటుగా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాల పెంపు కోసం పని చేస్తానని బైరెడ్డి చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన వారిలో అందరి కంటే చిన్న వయసు బైరెడ్డిదే. మరి..తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహణలో బైరెడ్డి ఎటువంటి మార్క్ చూపిస్తారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. అయితే, రాజకీయంగా మాత్రం 2024 ఎన్నికల నాటికి తనకు మరింత మద్దతు లభించేలా బైరెడ్డి బలమైన పునాది వేసుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసకుంటున్నారు.












Click it and Unblock the Notifications