ఈసారి మున్సిపల్ పోరులో సీన్ రివర్స్-సీ ప్యాక్ సర్వేలో షాకింగ్ ఫలితాలు..!
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటుకున్నాయి. 100 నగర పాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 13కి 12 కార్పోరేషన్లు గెల్చుకుంది. ఏకగ్రీవమైన 17 సీట్లు తీసేసి, మిగిలిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 70కి గానూ 67 చోట్ల కూటమి విజయం సాధించింది. ఇక రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 26న నాలుగు కార్పోరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో రెండో దశ మున్సిపల్ పోరు జరగబోతోంది.
ఈ నేపథ్యంలో రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి హవా కొనసాగిస్తుందా లేక విపక్ష వైసీపీ పుంజుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సీ-ప్యాక్ సంస్థ తమ తాజా సర్వే (C-PAC Survey) ఫలితాలను వెల్లడించింది. వీటిలో అనూహ్యంగా కూటమికి కాకుండా వైసీపీకి ఎడ్జ్ లభించింది. మొత్తం నాలుగు కార్పోరేషన్లకు గానూ రెండు కార్పోరేషన్లను పక్కాగా వైసీపీ చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. ఒక చోట టీడీపీ, మరొక చోట హోరాహోరీ పోరు నెలకుందని సర్వే తెలిపింది.

ఎన్నికలు జరగబోయే కార్పోరేషన్లలో శ్రీకాకుళం, రాజమండ్రిలో వైసీపీ విజయం సాధిస్తుందని, మంగళగిరి-తాడేపల్లిలో టీడీపీ గెలుస్తుందని, కాకినాడ కార్పోరేషన్లో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుందని సీ ప్యాక్ సర్వే తేల్చింది. మరోవైపు ఎన్నికలు జరిగే 19 మున్సిపాలిటీల్లోనూ వైసీపీ హవా ఉంటుందని సర్వే తెలిపింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 10 వైసీపీకి, 7 టీడీపీకి, రెండు జనసేనకు దక్కుతాయని ఈ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్ధితులు, తాజా ఎన్నికల ఫలితాలు చూసినా ఈ సర్వే ఫలితాలు అతిశయోక్తిగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు నాడి ఎలా ఉందో ఈ నెలాఖరు కల్లా తేలిపోనుంది.















Click it and Unblock the Notifications
