ఏపీలో 23 చోట్ల మున్సిపల్ పోరు-ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్ లో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 100 చోట్ల ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 23 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లలో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఎస్ఈసీ (AP SEC) అనిల్ చంద్ర పునేఠా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ 23 చోట్ల ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు, నగర పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆయా చోట్ల ఈనెల 14 నుంచి 16 వరకు పోటీలో ఉన్న అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తర్వాత ఈ నెల 19న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్ధులను పోటీలో ఉన్నట్లు ప్రకటిస్తారు.

ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన పట్టణ స్థానిక సంస్థల జాబితాలో ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట ఉన్నాయి. వీటిలో మున్సిపల్ వార్డులు, డివిజన్లకు ఎన్నికలతో పాటు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్ధానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు. ఏదైనా కారణం చేత ఎన్నికలకు ఆటంకాలు ఏర్పడితే మాత్రం ఈ నెల 27 రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు.














Click it and Unblock the Notifications
