ఈ నియోజకవర్గంలో గెలిస్తే మంత్రివర్గంలో బెర్త్ ఖాయం
Chirala Assembly Round up 2024: బాపట్ల జిల్లాలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- తెలుగుదేశానికి ఇప్పటివరకు సరైన అభ్యర్థులు దొరకట్లేదిక్కడ.
వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. బాపట్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు.. చీరాల. చీరాల, వేటపాలెం మండలాలు ఉంటాయి. సంఖ్యాపరంగా గానీ, రాజకీయంగా గానీ పద్మశాలీలు, దేవాంగుల ఓటుబ్యాంకు భారీగా ఉంటుంది. వారి తరువాత ఎస్సీలు, యాదవులు, వైశ్య, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతాయి.

గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచిన కొణిజేటి రోశయ్య రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 1989, 2004 ఎన్నికల్లో చీరాల ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. ఆ తరువాత టీడీపీ అభ్యర్థిగా ఇదే చీరాల నుంచి రెండుసార్లు విజయం సాధించిన పాలేటి రామారావు కూడా మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు- ఓ ఉప ఎన్నికతో సహా ఏడుసార్లు చీరాలలో ఎన్నికలు జరిగాయి. నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిచింది. సీపీఐ, జనతా పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత తొమ్మిది ఎన్నికలు జరగ్గా ఆ పార్టీదే జైత్రయాత్ర. టీడీపీ అయిదుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు విజయం సాధించాయి. 2014లో నవోదయం పార్టీ గెలిచింది.
2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్.. టీడీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావును 11,286 ఓట్ల మెజారిటీతో మట్టికరిపించారు. 2014లో నవోదయం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆమంచి.. టీడీపీ అభ్యర్ధిని పోతుల సునీతను 10,335 ఓట్ల తేడాతో ఓడించారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎడం బాలాజీకి 40,955 ఓట్లు పోల్ అయ్యాయి.
2019లో టీడీపీ ఇక్కడ పాగా వేసింది. కరణం బలరామ కృష్ణమూర్తి.. ఆమంచిపై 17,419 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం వారిద్దరూ వైసీపీలో ఉన్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అటు టీడీపీ గానీ, ఇటు వైఎస్ఆర్సీపీ గానీ ఇంకా ఖరారు చేయలేదు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడం బాలాజీ ప్రస్తుతం పర్చూరు ఇన్‌ఛార్జీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications