వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం - రూ 908 కోట్ల రుణాలు, నోటీసులు..!!
వైసీపీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆస్తును వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ దారుగా ఉన్న కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో ఆయన ఆస్తుల వేలానికి సంబంధించి బ్యాంకు ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి తీసుకున్న రుణాలు రూ 908 కోట్లు అయినట్లు బ్యాంకు వెల్లడించింది.
రుణం చెల్లించకపోవటంతో:ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ దారుగా ఉన్న మెస్సర్స్ ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపవటంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ప్రకటన జారీ చేసింది. మెస్సర్స్ సాయి సుధీర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భార్య అపర్ణ రెడ్డి, ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కంపెనీ కి తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి రూ 908 కోట్లుకు చేరుకున్నట్లుగా బ్యాంకు తెలిపింది. దీంతో కంపెనీ ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఆస్తులను కలిపి వేయం వేయనున్నట్లు బ్యాంకు ప్రకటనలో పేర్కొన్నారు.

బ్యాంకు వేలం నోటీసులు:శ్రీధర్ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారి పల్లి స్వగ్రామం. ఆయన తల్లి స్వగ్రామం కడప జిల్లా పులివెందులలోని బలపనూరు! వైఎస్ రాజశేఖరరెడ్డిది కూడా ఇదే ఊరు. శ్రీధర్ రెడ్డి తొలుత కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. ఉద్యోగం వదిలేసి కాంట్రాక్టులు, వ్యాపారాలు మొదలుపెట్టారు. భారీస్థాయి బ్యాంకు రుణాలు తీసుకొని వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేపట్టారు.
వైసీపీలో చేరి... కీలకనేతగా మారారు. 2014లో హిందూపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు నెలకొల్పారు. ఆయనకు ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పేరిట కంపెనీ ఉంది. ప్రస్తుతం ఇది సాయిసుధీర్ ఇన్‌ఫ్రాగా మారినట్లు తెలిసింది.
బిల్లులు మంజూరు కాక:తనఖా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని భూములు ఉన్నాయి. కర్ణాటకతో పాటు అనంతపురం జిల్లాలో ఇంజనీరింగ్ కంపెనీ పేరిట ఉన్న ఆస్తులను ఆగస్టు 18న ఇ-వేలం వేస్తామని కెనరా బ్యాంకు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులకు బిల్లులు మంజరు కావకపోవటంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే చెబుతున్నట్లుగా సమాచారం. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఇప్పుడు ఈ వేలం నోటీసుల వ్యవహారం రాజకీయ చర్చగా టర్న్ తీసుకుంది.












Click it and Unblock the Notifications