రోడ్లు రక్తసిక్తం: 7గురు మృతి, 29 మందికి గాయలు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం, రెడ్డివాని పాలెం గ్రామానికి చెందిన వారు సోమవారం పుష్కరాలకు వెళ్లారు.
సోమవారం వారు పుణ్యస్నానాలు ఆచరించి రాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, వీరు ప్రయాణిస్తున్న వాహనం కె. కోటపాడు వద్దకు రాగానే కల్వర్టును ఢీ కొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు.
మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్ధానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులను ఆసుపత్రిలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం:
వేగంగా వెళ్తోన్న రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తొండంగి మండలం బెండపూడికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై అన్నవరం వైపు వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతి చెందినవారు బెండపూడికి చెందిన గోకుశెట్ల నారాయణ, పాపాల రాముగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లారీ, బస్సు ఢీ కొని ఒకరు మృతి
ప్రకాశం జిల్లాలోని సింగరకొండ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసలు సంఘటనా స్ధలానికి చేరుకుని వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications