గుంటూరు జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి విజయవాడ, గుంటూరు జిల్లాలు వణికిపోతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది నెలకొంది. తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు లో వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. దీంతో విషాద ఘటన చోటుచేసుకుంది.
వరదలో కొట్టుకుపోయిన కారు ముగ్గురు మృతి
పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు మీద ఉదృతంగా వాగు ప్రవహిస్తున్నప్పటికీ ఆగకుండా ఆ వరద ఉధృతిలో ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన క్రమంలో ఒక కారు కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

కారులో ఇద్దరు స్కూల్ విద్యార్థులతో సహా టీచర్
నంబూరు లోని ఒక పాఠశాలలో ఉప్పలపాడు కు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించడంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడు కు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో మురుగువాగు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఆగకుండా వాగు దాటేస్తాము అన్న ఉద్దేశంతో కారును వేగంగా వరద ఉధృతిలో ముందుకు పోనిచ్చాడు.
మూడు కుటుంబాల్లో విషాదం
ఒక్కసారిగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్ర తో పాటుగా కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్, మాణిక్ లు మృతి చెందారు. స్థానికుల సహాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. దీంతో ఉపాధ్యాయుడితో పాటు ఆ విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
భారీ వర్షాల దెబ్బకు ఏపీలో ప్రాణ నష్టం
ఇక భారీ వర్షాలతో రోడ్ల పైన వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని ఇళ్ళకే పరిమితం అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న చోట వాహనాలతో ప్రయాణం చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ రోజు భారీ వర్షాల దెబ్బకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications