ఆడియో టేపులో దొరికిన తొలి సీఎం బాబే! ఆ స్వరంపై అక్కడే తేలుతుంది
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ఆడియో టేపు సాక్ష్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరు లేరు. ఆదివారం విడుదల చేసిన ఆడియో టేపులో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు వాయిస్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
అది చంద్రబాబు వాయిస్ అయితే, ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొని, ఆడియో టేపులో దొరికిన తొలి సీఎం చంద్రబాబు అవుతారని తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ ఓటును చేజిక్కించుకొనేందుకు యత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబుకూ పాత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. ఆదివారం నాడు ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం చెలరేగింది.

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితేనే..
ఓటుకు నోటు కేసులో ఆదివారం విడుదలైన ఆడియో సంభాషణల టేపులు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. టేపుల్లో చంద్రబాబు స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో మాట్లాడినట్టుగా ఉండటమే సంచలనానికి కారణం.
ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కోసం రూ.50 లక్షల ముడుపులను అప్పగించిన కేసులో ఈ ఆడియో టేపుల్ని ఆదివారం చానళ్లు ప్రసారం చేశాయి. చంద్రబాబు గవర్నర్‌ను కలిసిన కొద్దిసేపటికే ఈ టేపులు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్‌తో మాట్లాడుతుండగా పలుసార్లు బాస్ అనే పదం ప్రస్తావించారు. ఆ బాస్ చంద్రబాబేనంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, స్టీఫెన్ సన్ మధ్య జరిగినట్టుగా చెబుతున్న సంభాషణ ఆంగ్లంలో సాగింది.
చంద్రబాబు నిమిషంపాటు స్టీఫెన్ సన్‌తో మాట్లాడినట్టు ఆడియో సంభాషణల్లో విన్నదాన్నిబట్టి అర్థమవుతోంది. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి విశ్లేషిస్తే గానీ నిజానిజాలు బయటపడవు. ఆడియో టేపులో చంద్రబాబు... స్టీపెన్‌కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications