జగన్ - సాయిరెడ్డి బెయిల్ రద్దు కేసులో ఒకే సారి తీర్పు : వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ-పూర్తయిన వాదనలు..!!
ఈ రోజు సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వస్తుందంటూ అంచనాలు వ్యక్తం అయ్యాయి. దీంతో..రాజకీయంగా ఈ తీర్పు పైన ఉత్కంట నెలకొని ఉంది. అందరూ సీబీఐ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందా అనే ఆసక్తితో ఎదురు చూసారు. అయితే, ఇప్పటికే జగన్ కేసుల వాదనలు పూర్తికాగా.. సీబీఐ కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడిస్తుందని భావించారు. కానీ, జగన్ తో పాటుగా కేసుల్లో ఉన్న విజయ సాయి రెడ్డి బెయల్ కూడా రద్ద చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే కోర్టు విజయ సాయిరెడ్డి ని ఆదేశించింది.

సాయిరెడ్డి కేసులో వాదనలు..
సీబీఐ మాత్రం జగన్ కేసు తరహాలోనే కోర్టు విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇక, దీని పైన కోర్టు ఆదేశాలతో విజయ సాయిరెడ్డి తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసారు. దీని పైన ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణ సాగింది. రఘురామ ప్రధానంగా పార్లమెంట్ లో కీలక మంత్రుల పేషీల్లో తిరుగుతూ ఉంటారని..తన కేసుల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తన పిటీషన్ లో పేర్కొన్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో సాక్ష్యుల పైన ప్రభావం చూపించేలా ఉన్నాయని వివరించారు.

సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయండి..
ఈ రోజు జరిగిన విచారణలో పలు కారణాలను సాకుగా చూపుతూ కోర్టు హాజరు నుంచి మినహాయింపులు పొందుతున్నారంటూ రఘురామ న్యాయవాది సాయిరెడ్డి గురించి కోర్టుకు వివరించారు. దీని కారణంగా కేసు విచారణలో ఆలస్యం జరుగుతోందని వాదించారు. 2013లోనే ఛార్జ్ షీట్లు దాఖలైనా ఇప్పటివరకు వాటిలో విచారణ తుదిదశకు చేరలేదన్నారు. ఈ కేసులో నిందితులకు సాక్షులుగా ఉన్న అధికారులకు ఏపీలో కీలక పదవులు, పదోన్నతలు లభించాయని వాదించినట్లు సమాచారం. ఇక, సీబీఐ సైతం ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని రఘురామ లాయర్ కోర్టు ముందు తన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది.

సీబీఐది ద్వంద వైఖరి అంటూ..
కౌంటర్ దాఖలుకు నాలుగుసార్లు గడువు కోరి మొదటిసారి దాఖలు చేసిన మెమోనే పరిగణనలోకి తీసుకోవాలనడం కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ ఆయన వాదించినట్లు సమాచారం. అయితే, సీఎం జగన్ పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.

జగన్ కేసుల్లో పూర్తయిన వాదనలు..
బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు సీబీఐ కోర్టు తీర్పు వస్తుందని భావించినా..సాయిరెడ్డి కేసులో వాదనల తరువాత కోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. రెండు పిటిషన్ లలోనూ...ఒకే రకమైన ఆరోపణలు ఉన్నాయని..బెయిల్ షరతులు ఉల్లంఘించారనేదే పిటిషర్ ప్రధానమైన ఆరోపణ గా న్యాయస్థానం పేర్కొంది. దీంతో..రెండు పిటిషన్ లలో కలిపి ఒకేసారి ఆదేశాలు ఇవ్వటం అనేది సరైన నిర్ణయం అని కోర్ట్ భావిస్తోందని న్యాయమూర్తి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం సెప్టెంబర్ 15వ తేదీకి కేసు వాయిదా వేసారు. ఆ రోజున ఇద్దరి బెయిల్ రద్దు పిటీషన్ సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications