వివేకా కేసులో కీలక మలుపు - ఏంటీ నిన్ హైడ్రిన్ పరీక్ష, తేల్చేస్తారా..!!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా వివేకా కేసు సీబీఐ తేల్చాల్సి ఉంది. ఈ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. కేసులో కీలకంగా భావిస్తున్న లేఖ వ్యవహారంలో సీబీఐ కోర్టు తాజాగా నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇచ్చింది. మొత్తం కేసులో ఈ పరీక్ష కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఈ పరీక్ష వల్ల ఏం జరగనుందన్న ఆసక్తి మొదలైంది. ఈ పరీక్ష్ ద్వారా లేఖరాయించిన వ్యక్తుల వేలిముద్రలు బయటపడుతాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నిన్‌హైడ్రిన్ టెస్ట్ పై పడింది.

లేఖ కీలకంగా: వైఎస్ వివేకా కేసులో మరో కీలక మలుపు. వివేకా మరణం సమయంలో రాసినట్లుగా చెబుతున్న లేఖ పైన నిన్‌హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అసలు ఏంటీ నిన్‌హైడ్రిన్ టెస్ట్ అనేది ఆసక్తిగా మారుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన వివేకా కేసులో ఇప్పుడు ఈ లేఖ కీలకంగా మారుతోంది. సాక్షం కానుంది.
దానిపై నిన్‌హైడ్రిన్ ప్రయోగం చేస్తే అది దెబ్బతినే అవకాశం ఉంది. రసాయనిక ప్రయోగం త ర్వాత ఆ లేఖను కనీసం 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద వేడిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ పేపర్ పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. వివేకాతో బలవంతంగా లేఖరాయించిన వ్యక్తుల వేలిముద్రలు బయటపడుతాయి.
నేరస్తులు తెలిసే అవకాశం: కీలక పరీక్ష కావటంతో దీనివల్ల నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని కారణంగా ఈ అంశాన్ని సీబీఐ కోర్టు ముందుంచి అనుమతి కోరగా..అనుమతి లభించింది. నిన్‌హైడ్రిన్ అనేది ఒక రసాయనిక పౌడర్. దాని ఫార్ములా సీ9, హెచ్6, వో4. దీన్ని ఇథనాల్‌లో వేసినప్పుడు కరిగిపోతుంది. నిన్‌హ్రైడిన్ పౌడర్‌ను రసాయనిక ద్రావణంగా మార్చి వివేకా రాసిన లేఖపై స్ర్పే చేస్తారు.
లేదా ఆ రసాయనంలో లేఖను ముంచి బయటకు తీస్తారు. ఆ తర్వాత 80 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో దాన్ని వేడిచేస్తారు. దాన్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. పది నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలి ముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం నీలం ఉదారంగు(వంగపండు కలర్)లోకి మారుతుంది.
వేలిముద్రలు స్పష్టంగా: రంగు మారిన తరువాత అప్పుడు వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ వేలిముద్రలు ఎవరివో విచారణలో సీబీఐ తేలుస్తుందని చెబుతున్నారు. అయితే, వివేకా హత్యజరిగిన తర్వాత అనేక మంది ఆ లేఖను చేతులతో పట్టుకున్నారు. అందులో కుటుంబీకులు కూడా ఉన్నారు. సీబీఐ అధికారులు సైతం విచారణ సమయంలో పరిశీలించారు.
నాలుగేళ్ల తర్వాత చేపట్టనున్న నిన్‌హైడ్రిన్ టెస్ట్‌లో అసలు హంతకులకు బదులు ఇతరుల వేలిముద్రలు వెలుగుచూసే అవకాశం ఉందా...సాధ్యం అవుతుందా అనే చర్చ మొదలైంది. లేఖరాయించిన వారి వేలిముద్రలు దొరికే చాన్స్ ఉంటుందని విచారణ అధికారులు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు ఈ నిన్ హైడ్రిన్ పరీక్ష పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications