గోవిందుడి ఆలయంలో అరుదైన ఘట్టం- ఫిబ్రవరి 1 వరకూ
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 76,654 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,080 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది.
కాగా- తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేడు తెప్పోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6: 30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. దీనికోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు శ్రీ కోదండరామస్వామివారు, 27న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. 28న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి..పుష్కరిణిలో తెప్పలపై ఊరేగుతూ అశేష భక్తులను కటాక్షిస్తారు. 29వ తేదీన ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు వేంచేపు చేస్తారు.
30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో అమ్మవార్లతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై భక్తులకు కటాక్షిస్తారు. చివరి రోజు తెప్పోత్సవం అనంతరం ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు. ఈ వారం రోజుల పాటు కూడా గోవిందరాజ స్వామివారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టామని అన్నారు.












Click it and Unblock the Notifications