కుప్పంలో హైటెన్షన్, లాఠీచార్జ్, 144 సెక్షన్, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముందే అంతా !
కుప్పం/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చెయ్యడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చంద్రబాబు నాయుడిని శనివారం వేకువ జామున సినిమా స్టైల్లో అరెస్టు చెయ్యడం కూడా పలు విమర్శలకు దారితీయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు చెయ్యడాన్ని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంలోని ఏపీఎస్ఆర్ టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేయడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కుప్పం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కుప్పం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడుకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురైనారు. శనివారం వేకువ జామున 5 గంటల నుంచి కుప్పం ఆర్ టీసీ డిపోకు చెందిన ఆర్ టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, కర్ణాటకు, తమిళనాడు వెళ్లడానికి రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ కుప్పం పట్టణంలో దాదాపు 80 శాతం దుకాణాలు మూసివేశారు. కొందరు భయంతో షాపులు మూసివేస్తే కొందరు చంద్రబాబుకు మద్దతుగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముందు వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
అయితే అప్పటికే చంద్రబాబు అరెస్టుతో రగిలిపోతున్న టీడీపీ కార్యకర్తలు వైసీఎమ్మెల్సీ భరత్ ఇంటి ముందు గుమికూడి నిరసన వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకే చోట గుమికూడటంతో పరిస్థితులు అదుపు తప్పాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.

ఆ సందర్బంలో పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నించిన టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేసిన కుప్పం పోలీసులు అదే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముందు సంబరాలు చేసుకోవడానికి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎలా అనుమతి ఇస్తారు ? అంటూ టీడీపీ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు.
కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కుప్పం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన గ్రామాల్లోని ప్రజలు శనివారం కుప్పంలోకి రావడానికి భయపడే పరిస్థితి ఎదురైయ్యింది, నిత్యం కుప్పం మీదుగా తమిళనాడు, కర్ణాటకకు పలు రైళ్లు సంచరిస్తున్న నేపథ్యంలో కుప్పం రైల్లే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు, రైల్వే పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications