సొంతింటి కల తీరేలా ఆ పథకంలో మార్పులు.. కేంద్రం శుభవార్త!
ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి సహాయం అందించే పీఎం ఆవాస్ యోజనపై కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో తాజాగా ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపొందించారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న గృహాలను మరింత ఎక్కువమందికి చేరువచేయటానికి లబ్దిదారుల అర్హతా ప్రమాణాలను కూడా మార్చారు.
పీఎం ఆవాస్ యోజనపై కేంద్ర మంత్రి కీలక విషయాల వెల్లడి
ఇక ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈరోజు గుంటూరు నగరంలో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు ఆవాస్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణ అభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పీఎం ఆవాస్ యోజన గురించి కీలక విషయాలు వెల్లడించారు.

పీఎం ఆవాస్ యోజన కోసం ఆవాస్ యాప్... వాటిలో మార్పులు
తాజాగా దేశవ్యాప్తంగా నమోదైన రెండు కోట్ల నూతన గృహాలకు సరైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయటానికి ఈ ఆవాస్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనితోపాటు పెండింగ్లో ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కూడా అధికారులతో సమీక్షించామని మంత్రి తెలిపారు. అంతేకాదు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న గృహాలను మరింత ఎక్కువమందికి అందించాలన్న సంకల్పంతో లబ్దిదారుల అర్హతా ప్రమాణాలను మార్చామని కేంద్ర మంత్రి డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఇకపై వీరికి కూడా పీఎం ఆవాస్ యోజన
ఇంతకుముందు ఫ్రిజ్, టూవీలర్, పదివేలకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నా కూడా ఇల్లు మంజూరయ్యేది కాదని, దానిని మార్చి, ఆదాయ పరిమితి కూడా 15 వేలకు పెంచామని తెలిపారు. తాజాగా చేసిన మార్పులతో ఇల్లు లేని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిని పొందవచ్చని అన్నారు.
అక్రమాలకు తావు లేకుండా చర్యలు
అంతేకాదు పీఎం ఆవాస్ యోజన పథకంలో ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా అర్హులకు లబ్ది చేకూర్చేందుకు చర్యలు చేపట్టినట్టు, అందులో భాగంగానే ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చినట్టు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో, చేపట్టిన చర్యలతో అక్రమాలకు చెక్ పడుతుందని, నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications