పార్లమెంటులోనూ రుషికొండ ప్రస్తావన-ఏపీ సర్కార్ కు కేంద్రం హెచ్చరికలు..!
ఏపీలోని విశాఖపట్నం రుషికొండ తవ్వకాల వ్యవహారం ఇప్పుడు పార్లమెంటుకు కూడా చేరింది. ఏపీ ప్రభుత్వం నిబంధనల్ని ఉల్లంఘించి రుషికొండను తవ్వేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ హైకోర్టు జోక్యంచేసుకుని కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించాలని ఆదేశించింది. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కూడా కలిపి నియమించారు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాత్రమే కమిటీ వేసేలా ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంటులోనూ టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో స్పందించిన కేంద్ర పర్యావరణ మంత్రి అశ్వినీ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ తవ్వకాల విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తవ్వకాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర అధికారుల బృందం సమగ్ర పరిశీలన జరుపుతుందని ఆయన పార్లమెంటులో ఎంపీల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే అక్రమాలు జరిగినట్లు తెలితే చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర అధికారుల బృందం త్వరలో రుషికొండను సందర్శించనుంది. తవ్వకాల వ్యవహారంతో పాటు హైకోర్టు ఆదేశాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ ఇవాళ పార్లమెంటులో వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సంస్ధలు, అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని కూడా అశ్వినీ కుమార్ తెలిపారు. దీంతో రుషికొండ వ్యవహారంలో అక్రమాలు నిర్ధారణ అయితే కేంద్రం తీసుకోబోయే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications