గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం, నిర్ణయం వెనుక..!!
టీడీపీకి గవర్నర్ పదవి దక్కింది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకంలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ టీడీపీకి అవకాశం కల్పించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాయిస్ మేరకు గతంలో మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించారు. ఈ పదవి కోసం టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి. చివరకు అశోక్ గజపతి రాజు ను ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
టీడీపీకి గవర్నర్ పదవి
కేంద్రం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి కేటాయించింది. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును నియమించింది. హర్యానా గవర్నర్ ఆషిమ్ కుమార్ ఘోష్.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీంద్ర గుప్తాను కేంద్రం నియమించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ.. పలు హోదాల్లో అశోక్ గజపతి రాజు పని చేసారు. సౌమ్యుడిగా.. వివాద రహితుడుగా పేరున్న అశోక్ గజపతి రాజుకు తొలుత కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని భావించారు. అయితే, ఆయన తన వంశ పారంపర్యంగా వస్తున్న ట్రస్టుకు ఛైర్మన్ గా ఉండటంతో సాంకేతికంగా సాధ్యం కాలేదు. అశోక్ కుమార్తె ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో, టీడీపీ నుంచి గవర్నర్ పదవి కోసం సీఎం చంద్రబాబు ఆయన పేరు సూచించారు.

మోదీ మార్క్ ఎంపిక
అశోక్ గజపతి రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా పని చేసారు. ఎన్డీఆర్, చంద్రబాబు కేబినెట్ లో పలు కీలక శాఖలు నిర్వహించారు. అసెంబ్లీ వ్యవహారాలతో పాటుగా ఆర్దిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షించారు. 2014 లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన నాడు మోదీ ప్రభుత్వం లో విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో నిర్వహించారు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతి రాజుకు పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి గవర్నర్లు గా అవకాశం దక్కటంతో.. ఇప్పుడు మిత్రపక్షం టీడీపీకి ఛాన్స్ దక్కింది. ఏపీ నుంచి ఇప్పటికే కంభంపాటి హరిబాబు... తెలంగాణ నుంచి ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ గవర్నర్లుగా కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్త్రాత్రేయ స్థానంలో కొత్త గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు. దీంతో, ఇప్పుడు దత్తాత్రేయకు మరో రాష్ట్రం కేటాయిస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

అశోక్ వైపు మొగ్గు
టీడీపీకి గవర్నర్ల పదవుల విషయంలో అశోక్ తో పాటుగా యనమల పేరు తెర పైకి వచ్చింది. అయితే, యనమల కుటుంబానికి ఒక ఎంపీతో పాటుగా రెండు ఎమ్మెల్యే పదవులు కేటాయించారు. యనమల తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని.. లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ఇప్పటికే స్పష్టం చేసారు. అయితే, పార్టీకి తొలి నుంచి విధేయుడిగా.. విద్యావేత్తగా ఉన్న అశోక్ గజపతి రాజు వైపు ప్రధాని మోదీ - సీఎం చంద్రబాబు ఆసక్తి చూపారు. ఇప్పుడు గోవా గవర్నర్ గా అశోక్ ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.












Click it and Unblock the Notifications