దిశ బిల్లుకు కేంద్రం మరో కొర్రీ-రాజ్యసభలో ప్రకటన-వివరణ వచ్చాక రాష్ట్రపతికి
ఏపీ దిశ బిల్లులు మరోసారి త్రిశంకు స్వర్గంలో పడ్డాయి. దిశ బిల్లుల ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రాజ్యసభలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీలు అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. ప్రస్తుతం దిశ బిల్లులు ఎక్కడున్నాయో కూడా చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం వీటి ఆమోదం కోసం మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్ధితి.
ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లులు ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉన్నాయని, న్యాయసలహా కోసం వీటిని పంపినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. అలాగే న్యాయశాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరినట్లు వెల్లడించింది. ఈ వివరణ రాగానే రాష్ట్రపతికి పంపుతామని కూడా తెలిపింది. దీంతో కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా ఇవ్వగలిగితే దిశ బిల్లులు రాష్ట్రపతికి చేరనున్నాయి. కాబట్టి కేంద్రం దిశ బిల్లుల వ్యవహారాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టినట్లయింది.

Recommended Video
వాస్తవానికి దిశ బిల్లుల్ని గతంలో ఓసారి ఆమోదించి పంపిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి ఆమోదం కోసం ప్రయత్నించింది. అప్పుడు కూడా కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్రం వాటిని వెనక్కి తీసుకుంది. అనంతరం ఈ ఏడాది మరోసారి అసెంబ్లీలో వాటికి మార్పులు చేసి ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్రానికి పంపినా ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం కేంద్రం ఇవి పరిశీలనలో ఉన్నాయని మాత్రం చెబుతోంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపామని ఓ కొత్త విషయం వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రం నుంచి వివరణ వస్తే రాష్ట్రపతికి ఈ బిల్లులు పంపుతామని కూడా చెప్పింది. దీంతో దిశ బిల్లుల ఆమోదంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిని సకాలంలో పంపగలిగితే ఈ పార్లెమంటు సమావేశాల్లోనే వాటికి ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications