Amaravati: అమరావతికి కేంద్రం బిగ్ న్యూస్- ఆ 15 వేల కోట్ల అప్పు..?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి విషయంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదే క్రమంలో రాజధాని నిర్మాణ పనులకు ఊతమిచ్చేందుకు వీలుగా ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ తో పాటు పలు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకునే అప్పులకు గ్యారంటీగా ఉండేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు కూడా అంగీకరించాయి. అయితే ఇప్పుడు కేంద్రం మరో బిగ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో కేంద్ర బడ్జెట్ లో 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అనంతరం ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునేందుకు కేంద్రం హామీగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధులు అమరావతి రాజధానికి వచ్చి పనులు పరిశీలించి వెళ్లారు. అనంతరం ఈ రెండు బ్యాంకులు వేర్వేరుగా ఈ మొత్తం విడతల వారీగా కేటాయించేందుకు అంగీకారం తెలిపాయి.

అయితే అసలే అప్పులతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ రుణాలు తిరిగి చెల్లించడం కూడా సమస్యగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. దీంతో వీటిని గ్రాంట్ గా మార్చాలంటూ కోరింది. దీనిపై అధికారులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు 15 వేల కోట్ల ఉమ్మడి రుణాన్ని గ్రాంట్ గా మార్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని బయటి నుంచి సాయం తీసుకునే ప్రాజెక్టుల కేటగిరీలో ఉంచి గ్రాంట్ గా మార్చబోతున్నట్లు సమాచారం.
అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు భారీ ఊరట లభించబోతోంది. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం రూ.71 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భవిష్యత్తులో ఈ మొత్తం లక్ష కోట్లు కూడా దాటిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అందులో 15 వేల కోట్లు రుణం నుంచి గ్రాంటుగా మారితే ఆ మేరకు ఉపశమనం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే ఈ మేర భవిష్యత్తులో రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం లభించనుంది.












Click it and Unblock the Notifications