బీజేపీపై వైసీపీ ఎటాక్ స్టార్ట్ - ఢిల్లీలో ధర్నా చేస్తే..నేను వస్తా : సెస్ పేరుతో కేంద్రం దోపిడీ- పేర్ని నాని..
బీజేపీ నేతల తీరు పైన ఆచి తూచి స్పందించే వైసీపీ నేతలు ఇక, కౌంటర్ చేయాలని నిర్ణయించారు. కేంద్రం తీరు పైన నేరుగా మంత్రి విరుచుకుపడ్డారు. గ్యాస్ ధరలు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నా రంటూ ఫైర్ అయ్యారు. తాజాగా ఏపీ బీజేపీ నేతలు పెట్రోలు ధరలు తగ్గించకపోతే ధర్నాలు చేస్తామంటూ బీజేపీ..టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆయన సీరియస్ అయ్యారు. కేంద్రం ప్రజలంటే ఎటువంటి భయం - బెరుకు లేకుండా రూ 70 ఉండే పెట్రోలు ధరను రూ 116 కు పెంచిందని చెప్పుకొచ్చారు.

కేంద్రం ఏం చేసింది..ఏం తగ్గింపు ఇది
5 రూపాయాలు..10 రూపాయలు తగ్గించి గొప్ప చేసినట్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పటం విడ్డూరంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆదాయ లోటు భర్తీ కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు రూపాయాల సెస్ అప్పుడు విధించారన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం రూపాయి సెస్ అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీలోని కొంత శాతాన్ని తగ్గించిందని వివరించారు. కేంద్రం సాలీనా సెస్ పేరుతో రెండు లక్షల 87 వేల కోట్ల మేర వసూలు చేస్తుందని లెక్కలు చెప్పారు.

కేంద్రం వసూలు చేస్తున్న సెస్ వివరాలు వెల్లడి
పెట్రోలు..డీజిల్ సెస్ గా మరో 47 వేల కోట్లు వసూలు చేస్తుందన్నారు. కేంద్రం పన్నుల వాటాగా పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని..దీని నుంచి తప్పించి వారే వసూలు చేసుకొనే విధంగా సెస్ పేరుతో ప్రజల పైన భారం వేస్తున్నారని విమర్శించారు. విమర్శలు చేస్తున్న నేతలకు నిజాయితీ ఉంటే..పార్లమెంట్ వద్దకు వెళ్లి ధర్నా చేయాలని..ప్రధానిని ప్రశ్నించాలని సూచించారు. ఇప్పుడు తగ్గించేదే కాకుండా.. మరో 25 రూపాయాలు తగ్గించాలని డిమాండ్ చేసారు. ఢిల్లీలో ధర్న పెడితే..తాను వ్యక్తిగతంగా వస్తానని నాని స్పష్టం చేసారు.

బీజేపీ నేతల పైన డైరెక్ట్ ఎటాక్
రోడ్ల నిర్మాణం పేరుతో కేంద్రం లక్షా 98 వేల కోట్ల సెస్ గా వసూలు చేస్తోందని వివరించారు. అన్ని రాష్ట్రాలు పెట్రోలు..డీజిల్ ధరలు తగ్గించాయంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని.. .దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలు తగ్గించలేదని వెల్లడించారు. మహారాష్ట్ర ..ఢిల్లీ..తెలంగాణ..పశ్చిమ బెంగాల్..తెలంగాణలో..కేరళ..జార్ఘండ్ లో ఎందుకు తగ్గించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీ కి ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వటంతో వారికి ఇప్పుడు ప్రజాగ్రహం గుర్తుకు వచ్చిందని చెప్పారు. ఈ రకమైన బఠానీ..బిస్కెట్లు ప్రజలకు తెలుసన్నారు.

ఢిల్లీలో ధర్నా చేస్తే నేను వస్తా
చంద్రబాబు అధికారంలో ఉన్న పెట్రోల్ పైన 31 శాతం.. డీజిల్ పపైన 22 పైగా శాతం టాక్స్ వేసారని మంత్రి వివరించారు. కేంద్రం ఇంత భారీ మొత్తంలో వసూలు చేస్తున్న సెస్ తో ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు మీకు కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. వంట గ్యాస్ ధరల విషయంలోనూ స్పందించాలని డిమాండ్ చేసారు. ఇంకా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించేలా ఏపీ బీజేపీ నేతలు ధర్నా చేయాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకే భారీగా ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications