జగన్ మానసపుత్రికకు మరో షాక్-కేంద్రం కొత్త కొర్రీలు-కేసీఆర్ అభ్యంతరాల నేపథ్యం
vఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తెరపైకి తెచ్చిన ఓ కీలక ప్రాజెక్టుకు అనుమతులిచ్చే విషయంలో కేంద్రం మరోసారి సాగదీత ధోరణి అనుసరిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో జగన్ మానసపుత్రిక అయిన రాయలసీమ లిఫ్ట్ కు పర్యావరణ అనుమతులు ఇవ్చే విషయంలో కేంద్రం మరోసారి దాటవేతకే ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ నుంచి వ్యతిరేకత నేపథ్యంలో జగన్ కోరుకున్న విధంగా అనుమతులు ఇవ్వకుండా కొత్త కొర్రీలు పెట్టి ఈ ప్రాజెక్టు అనుమతుల్ని వాయిదా వేయడం సంచలనం రేపుతోంది.

జగన్ మానసపుత్రికకు కేంద్రం షాక్
కరువుతో అల్లాడుతున్న తన సొంత గడ్డ రాయలసీమకు న్యాయం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. శ్లీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాల్ని సీమకు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఈ వ్యపహారం కాస్తా కేంద్రం కోర్టులోకి చేరింది. తెలంగాణతో వివాదాల నేపథ్యంలో కేంద్రమే అన్ని వ్యవహారాలు చూడాలని జగన్ కోరడంతో ఇప్పుడు రంగంలోకి దిగిన కేంద్రం... రాయలసీమ లిఫ్ట్ కు తొలి షాకిచ్చింది.

సీమ లిఫ్ట్ కు కేంద్రం కొత్త కొర్రీలివే
రాయలసీమలో ప్రతిపాదిస్తున్న కొత్త ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నాలుగు కొత్త కొర్రీలు పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్టు అనుమతుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ కొర్రీల్లో కృష్ణానదిలో నీటి లభ్యతపై పూర్తిస్ధాయి నివేదిక ఇవ్వాలని కోరింది. నదిపై ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, జల విద్యుత్ కేంద్రాల వివరాలు ఇవ్వాలని మరో కొర్రీ పెట్టింది.
రాయలసీమ లిఫ్ట్ పూర్తి కావడానికి ముందు, తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకునే విధానంపై అధ్యయన ఇవ్వాలని కూడా కోరింది. ఈ ప్రాజెక్టుతో పాటు దాని చుట్టు పక్కల ఉన్న ఎత్తిపోతల పథకాలు, వాటి పర్యావరణ అనుమతుల వివరాలు ఇవ్వాలని కోరింది. చివరిగా రాయలసీమ లిఫ్ట్ నిర్మాణఁ వల్ల శ్లీశైలంలో నీరు తగ్గి పర్యావరణానికి కలిగే ఇబ్బందులను కూడా తెలపాలని కేంద్రం కోరడంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది.

కేసీఆర్ అభ్యంతరాలే కారణం
రాయలసీమ లిఫ్ట్ కు కేంద్రం పెట్టిన తాజా కొర్రీలు చూస్తే ఇవన్నీ గతంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై పెట్టిన అభ్యంతరాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.. ఇందులోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ లిఫ్ట్ కు నీరు తీసుకుంటే అక్కడ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని కేసీఆర్ వాదిస్తున్నారు.
అలాగే రాయలసీమ లిఫ్ట్ కు అనుమతిస్తే అక్కడితో ఏఫీ ప్రభుత్వం ఆగదని, మరిన్ని జల విద్యుత్ కేంద్రాలు, ఇతర చిన్నా చితకా ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉందని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాటినే కేంద్రం కొర్రీల రూపంలో జగన్ సర్కార్ ముందు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రంతో జగన్ మరో లాబీయింగ్ తప్పదా ?
తెలంగాణతో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇచ్చిన గెజిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జగన్ సర్కార్ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ను సాధించుకునే విషయంలోనూ మరో లాబీయింగ్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్ధితి. అదీ జగన్ మానసపుత్రిక అయిన రాయలసీమ లిఫ్ట్ కు తెలంగాణ పెడుతున్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రంతో లాబీయినంగ్ చేసి దీన్ని సాధించుకోవడం అంత సలువుగా కనిపించడం లేదు. ఈ కీలక ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తే కేసీఆర్ దీన్ని తెలంగాణలో రాజకీయం చేయడం ఖాయమని భావిస్తున్న బీజేపీ ఇలాంటి కొర్రీలతో మరికొంతకాలం కాలక్షేపం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications