సజ్జల విషయంలో ఏం చేద్దాం - మీరే చెప్పండి..!!
ఏపీ ఎన్నికల వేళ కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. వైసీపీ ప్రచార తీరు.. అధికారుల శైలి పైన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో, సజ్జల విషయంలో ఏం చేయాలో సూచించాలని కోరుతూ తాజాగా సీఈవో మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.
సజ్జల పై ఫిర్యాదు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ మీనా నిర్ణయానికి రాలేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని అచ్చెన్నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈసీకి లేఖ
అయితే ఎన్నికల నియమావళిలో సలహాదారులు లక్ష్మణ రేఖ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి నిబందనలనూ పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌కు తాజాగా లేఖ రాశారు. ప్రభుత్వంలో 40 మంది సలహాదారులున్నారని, ఇందులో 9 మందికి కేబినెట్ ర్యాంకు ఉందని.. మిగిలిన 31 మంది పీ, క్యూ, ఆర్ కేటగిరీల్లో ఉన్నారని.. ప్రభుత్వం నుంచి జీత భత్యాలు అందుకుంటూ సౌకర్యాలు అనుభవిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
చర్యలు ఉంటాయా
ఇదే సమయంలో సలహాదారులందరికీ వర్తించేలా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని అభ్యర్థించారు. అయితే.. పేరేదైనా ప్రభుత్వ ఖజానా నుంచే సలహాదారులు జీతభత్యాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుచేత ఆ స్థాయి వ్యక్తులకు వర్తించే నియమావళే సలహాదారులకూ వర్తింపజేయాలన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి వచ్చే స్పందన మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications