ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
Summer season: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ వాటి తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.

పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 14 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉంది. రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,109 ఓ మోస్తరు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మంగళవారం నాడు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు- 37,
కడప- 36, తిరుపతి- 34, శ్రీసత్యసాయి- 32, చిత్తూరు- 31, అనంతపురం- 31, అన్నమయ్య రాయచోటి- 30, నంద్యాల- 29, పల్నాడు- 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.
మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో గరిష్ఠంగా 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే. విజయనగరం జిల్లా జామిలో 44.9, కడప జిల్లా ఖాజీపేటలో 44.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 66 మండలాల్లో తీవ్రస్థాయిలో, 84 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీచాయి.












Click it and Unblock the Notifications