వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ లేనట్టేనా..రేసులో మరో నేత..?
శాసన మండలిలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాల గురించి ఇప్పుడు విపరీతమైన చర్చ సాగుతోంది. ఆ రెండు స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ రెండు స్థానాలు కూడా అధికార టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఆయా నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఎవరికి ఆ పదువులు దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది. అయితే ఒక ఎమ్మెల్సీ స్థానంపై జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. మరోవైపు టీడీపీ నుంచి ఆశావహుల లిస్ట్ కూడా పెద్దదిగానే కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్‌ను గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేసిన వర్మకు ఓ ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఒక స్థానం వర్మకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఎమ్మెల్సీ స్థానం వంగవీటి రాధాకు కేటాయించి మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికి ..రాధా కోసం ఓ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే కచ్చితంగా రాధాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా రేసులోకి మాజీ మంత్రి దేవినేని ఉమ పేరు తెర మీదకు వచ్చింది. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటును వదులుకున్న దేవినేని ఉమకు ఇస్తారని టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుకు దేవినేని ఉమ సన్నిహితుడు కావడం పైగా ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడంతో ఎమ్మెల్సీ ఆయనకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట దేవినేని ఉమకు ఎమ్మెల్సీ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి రాధాకు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications