ప్రభుత్వం నిద్రపోతోంది - పార్టీ శ్రేణులు అండగా నిలవండి : చంద్రబాబు పిలుపు..!!
వరదలతో గోదావరి పరిసరాల్లోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని..ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రోపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు.. ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఆరు జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525 పైగా గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమయింది. పోలవరం ముంపు గ్రామాలతో పాటు... లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వివరించారు.
ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత మేర సాయం చెయ్యాలని పార్టీ నేతలకు..కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందుగా తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేసారు. వరదలపై ఆయా గ్రామాల ప్రజల మొబైల్ ఫోన్ లకు రియల్ టైంలో వరద సమాచారం పంపి...వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని పాలనతో మిళితం చేసిందని వివరించారు. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింపజేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించేవాళ్లమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసారన్నారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే చిన్న సూచన కూడా వారికి ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత మేర సాయం చెయ్యాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications