రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
ఏపీలో రఘురామ సీటు వ్యవహారం ఆసక్తి పెంచుతోంది. నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్దిగా బరిలో దిగాలని రఘురామ ఆశించారు. కానీ, బీజేపీ నుంచి సీటు దక్కలేదు. దీంతో..తనకు నర్సాపురం నుంచి సీటు ఇప్పించే బాధ్యత చంద్రబాబుదేనని రఘురామ స్పష్టం చేసారు. రఘురామ సీటు గురించి కూటమి నేతల్లో చర్చ మొదలైంది. టీడీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పూర్తి స్థాయిలో అభ్యర్దులను ప్రకటించారు. జనసేన నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇదే సమయంలో రఘురామ విషయంలో కొత్త ప్రతిపానద తెర మీదకు వచ్చింది.
రఘురామ సీటు ఎక్కడ
మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. బీజేపీ 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దులను వెల్లడించింది. జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. అందులో 18 అసెంబ్లీ స్థానాలకు పవన్ తమ అభ్యర్దులను ప్రకటించారు. మరో 3 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక, రఘురామ రాజు సిట్టింగ్ స్థానం కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి వెళ్లింది. అక్కడ రఘురామ ను కాదని, పార్టీలో 30 ఏళ్లుగా పని చేస్తున్న శ్రీనివాసవర్మకు పార్టీ సీటు కేటాయించింది. దీని పైన రఘురామ సీరియస్ గా స్పందించారు. తనకు సీటు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉందని చెప్పుకొచ్చారు.

కొత్త ప్రతిపాదన పై చర్చ
టీడీపీ నుంచి సీట్లు కేటాయించే పరిస్థితి కనిపించటం లేదు. పూర్తి జాబితా ఇప్పటికే ప్రకటించారు. దీంతో, తాజాగా రఘురామను కాకినాడ నుంచి జనసేన అభ్యర్దిగా బరిలోకి దించే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రఘురామ కాకినాడ నుంచి పోటీకి సిద్దపడితే బీజేపీ నేతలతో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నారు. గతంలో కాకినాడ నుంచి బీజేపీ అభ్యర్దిగా 1998లో కృష్ణంరాజు పోటీ చేసి గెలుపొందారు. కేంద్రమంత్రిగా వ్యవహరించారు. దీంతో, ఇప్పుడు నర్సాపురంలో అభ్యర్ది మార్పుకు బీజీపీ సిద్దంగా లేకపోవటంతో కూటమి నేతలు ప్రత్యామ్నాయంగా కాకినాడ వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేన నుంచి పోటీకి ఛాన్స్
జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు పోటీలో దక్కాయి. అందులో కాకినాడ నుంచి సానా సతీశ్, ఉదయ్ శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పవన్ పిఠాపురం నుంచి పోటీ పైన ప్రకటన సమయం లోనూ ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ సీటు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు రఘురామకు సీటు విషయంలో బీజేపీ ముఖ్యులతో చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీటు ఇవ్వకపోవటంతో, తమ పార్టీ నుంచి సీటు ఇస్తే బీజేపీ నేతల స్పందన ఏంటనేది తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అవసరమైతే కాకినాడ బీజేపీకి ఇచ్చి, నర్సాపురం జనసేన తీసుకొనే అంశం కూడా ఒక ప్రతిపాదనగా తెలుస్తోంది. దీంతో..ఢిల్లీ అభిప్రాయం మేరకు పవన్ తన తుది నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉంది. దీంతో..రఘురామ సీటు విషయంలో ఫైనల్ డెసిషన్ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications