చంద్రబాబు పార్టీ సమీక్షలు రద్దు: కౌంటింగ్ పైనే ఇక దృష్టి: ఆందోళన పెరుగుతోందా..!
ఏపీలో జరిగిన ఎన్నికల పైన టీడీపీ అధినేత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమీక్షలను ఇక రద్దు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కొద్ది రోజులుగా ఎందుకో టీడీపీలో కౌంటింగ్ గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. దీంతో..సమీక్షలను ఇక నిలిపివేసి నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ నిర్వహించాలని నిర్ణయించారు. 20వ తేదీ లోగా ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారు.
సమీక్షలకు ముగింపు..
టీడీపీ విజయం ఖాయమని ఒక వైపు చెబుతూనే..నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల రెండో తేదీన లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసారు. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్దులు..పార్టీ నేతలతో ఈ సమీక్షలు నిర్వహించారు. దాదాపు పది లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి..పోలింగ్ సరళి మీద సమీక్షించారు. అప్పటికే ముఖ్యమంత్రి తాను చేయించిన సర్వేల వివరాలను అభ్యర్దులకు వివరించారు. అయితే, కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో, ఇప్పటి వరకు నిర్వహించిన సమీక్షలను ఇక్కడితో నిలిపివేసి..నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పై ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక బలమైన కారణాలను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

కౌంటింగ్ పైనే ఉత్కంఠ..
ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన సమయం నుండి టీడీపీ అదినేత ఈవీఎంల గురించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల పైన నమ్మకం లేదని వీవీ ప్యాట్స్‌ను లెక్కించాలని కోర్టు కెళ్లారు. ప్రతీ నియోజకవర్గంలో రాండమ్‌గా అయిదు శాతం వీవీప్యాట్స్ లెక్కించాలని కోర్టు ఆదేశించింది. దీనిని 50 శాతానికి పెంచాలంటూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో..ఓట్ల లెక్కింపు సమయంలో జాగ్రత్తగా ఉండాలని..కుట్రలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత పదేపదే నేతలకు సూచిస్తున్నారు. అయితే, టీడీపీ నేతలు ఇంతగా లెక్కింపు ప్రక్రియ పైన ఆందోళన చెందటానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. దీని ద్వారా లెక్కింపు రోజున రాజకీయ పరిస్థితులు మరింత ఉత్కంఠ పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications