గుడివాడలో వాళ్లను చూసైనా మారరా - నేనే స్వయంగా రంగంలోకి : చంద్రబాబు..!!
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం చంద్రబాబు అప్రమత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా కీలక నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ పైన ఈ సారి చంద్రబాబు అనేక మార్గాల్లో సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నాని పైన గెలవాలనేది చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే అక్కడ మినీ మహానాడుకు నిర్ణయించనా.. స్థానికంగా పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు..వర్షాల కారణంగా వాయిదా పడింది.

గుడివాడ పై ప్రత్యేకంగా
ఇప్పుడు చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నాయకుల మధ్య సమన్వయం కరవైందంటూ సీరియస్ అయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.

జిల్లాపై చంద్రబాబు స్వయంగా
ఇకపై మీ జిల్లా వ్యవహారాలు తానే చూస్తానని .. తానే గుడివాడతో సహా జిల్లాలో పార్టీ పరిస్థితులను సమీక్షిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. గుడివాడలో తెలుగు మహిళల పోరాటాన్ని చూసైనా కొందరు నియోజకవర్గ బాధ్యులు తీరు మార్చుకోవాలని చంద్రబాబు చురకలు అంటించారు. చంద్రబాబు కొంతకాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకత్వంపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్న కారణంగా హాజరు కాలేదని చెబుతున్నారు. అదే విధంగా దేవినేని ఉమా - బోండా ఉమా విదేశాల్లో ఉండటంతో సమావేశంలో పాల్గొనలేదని తెలుస్తోంది.

జిల్లా నేతలే పార్టీకి సమస్యగా
అయితే, టీడీపీకి కంచుకోటగా ఉన్న క్రిష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితి పైన చంద్రబాబు ఆగ్రహం.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యల పైన ఆయన కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు.. టీడీపీకి బలంగా ఉన్న జిల్లాల్లో వైసీపీ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు టీడీపీలో పార్టీ నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్.. ఆధిపత్య పోరు.. విభేదాలను పరిష్కరిస్తేనే పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక, తానే జిల్లా వ్యవహారాలు చూస్తానని చెబుతున్న చంద్రబాబు.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications