ఒక దెబ్బ కొడితే 10 రెట్లు కొట్టాం. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొద్ది రోజులుగా ముదురుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి వాతావరణాన్ని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా రాయబార ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తాము చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చేసిన విజ్ఞప్తికి వాషింగ్టన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. అయితే, ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం మాత్రం పూర్తిగా 'ముగిసిపోయిందనే' తమ పాత వైఖరికే అమెరికా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. "చర్చలు కొనసాగించాలని ఇరాన్ మమ్మల్ని కోరింది, అందుకు మేము అంగీకరించాము. కానీ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందనే విషయాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా అమెరికా వారికి స్పష్టం చేసింది" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ దేశాలను మళ్లీ చర్చల వైపు మళ్లించేందుకు ఖతార్ దేశానికి చెందిన రాయబారులు, మధ్యవర్తులు ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. అమెరికాతో ముందుగా చేసుకున్న సమన్వయం ప్రకారమే ఖతార్ ఈ పర్యటనను ప్లాన్ చేసిందని, ఉద్రిక్తతలను తగ్గించి ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకే ఈ చర్చలు జరుగుతున్నాయని దౌత్య వర్గాల సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరుపుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతికారంగా అమెరికా దళాలు ఇరాన్‌పై వరుస దాడులకు దిగాయి. దీంతో ఆగ్రహించిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్ , జోర్డాన్‌లలోని అమెరికా ఎయిర్ బేస్ లు లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

వాళ్లు అనారోగ్య మానసిక స్థితిలో ఉన్నారు..
ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం తనకు ఎప్పుడో ముగిసిపోయిందని, ఇకపై వారితో ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదని ట్రంప్ బుధవారమే ప్రకటించారు. టర్కీలో జరిగిన 2026 నాటో (NATO) సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నా దృష్టిలో ఆ ఒప్పందం ఎప్పుడో ముగిసిపోయింది. ఇకపై వారితో మాట్లాడటం కేవలం సమయం వృధా. వాళ్లంతా అనారోగ్యకరమైన మానసిక స్థితిలో ఉన్న లీడర్లు. మా రాయబారులు చర్చలు జరపాలని అనుకుంటున్నారు, వారు మంచివారే.. కానీ నిర్ణయం కోసం నా దగ్గరికే రావాలి" అని ట్రంప్ పేర్కొన్నారు.
మేము 10 రెట్లు గట్టిగా కొట్టాము..
మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని తాను ప్రకటించినప్పటికీ, ఇరు దేశాల మధ్య మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని తాను భావించడం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. "యుద్ధం మళ్లీ మొదలవుతుందని నేను అనుకోవడం లేదు. అంతా చాలా వేగంగా ముగిసిపోతుంది. వారు మా నౌకలపై కొన్ని దాడులు చేశారు, అందుకు మేము వారిపై అంతకంటే గట్టిగా విరుచుకుపడ్డాము. వారు ఒక దెబ్బ కొడితే.. మేము 10 రెట్లు గట్టిగా కొట్టాము" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ జరుపుతున్న ఈ తాజా మధ్యవర్తిత్వ చర్చలు ఏ మేరకు సఫలమవుతాయో , అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయో లేదో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications