Trump: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ పిక్స్! శత్రువులకు బిగ్ వార్నింగ్
ప్రపంచ రాజకీయాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శైలి ఎప్పుడూ భిన్నమే. క్లిష్టమైన అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనప్పుడు అధినేతలు సాధారణంగా పత్రికా ప్రకటనలు, వైట్ హౌస్ హెచ్చరికలతో సరిపెడతారు. కానీ, ట్రంప్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ.. తన 'ట్రూత్ సోషల్' ఖాతాను వేదికగా చేసుకుని ఏఐ ద్వారా రూపొందించిన కాన్సెప్ట్ ఇమేజ్స్ తో సరికొత్త 'డిజిటల్ విజువల్ వార్' ప్రారంభించారు. సైనిక బలాన్ని, తన నాయకత్వాన్ని వినూత్నంగా చూపిస్తూ ఆయన పోస్ట్ చేస్తున్న ఏఐ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
సోషల్ మీడియాను ముంచెత్తిన ఏఐ పోస్టర్లు!
ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఒక్కసారిగా ఏఐ సాంకేతికతతో సృష్టించిన దాదాపు 16కు పైగా చిత్రాలు, పోస్టర్లను వరుసపెట్టి పోస్ట్ చేశారు. సైనిక కమాండర్‌గా తనను తాను ప్రాజెక్ట్ చేసుకోవడమే కాకుండా, తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరేలా వీటిని తీర్చిదిద్దారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కేనెడీతో కలసి ఉన్నట్లు, పడిపోతున్న జార్జ్ వాషింగ్టన్‌ను కాపాడుతున్నట్లు, హాలీవుడ్ తరహా 'కాస్మిక్ కమాండర్' రేంజ్‌లో తనను తాను ఎలివేట్ చేసుకుంటూ పోస్ట్‌లు పెట్టారు. ఇవి ఆయన మద్దతుదారులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

ఇరాన్ ఇంధన రవాణాపై ఏఐ దాడి!
ఈ సిరీస్‌లో అత్యంత సంచలనం సృష్టించినవి ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఫోటోలే. ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్‌ను అమెరికా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు, దానిపై నిలబడిన ట్రంప్ "This is Our Oil Tanker Now" కేప్షన్‌తో ఫోటో వదిలారు. అంతేకాకుండా ఇరాన్‌లోని ప్రధాన ఇంధన ఎగుమతి కేంద్రమైన 'ఖార్గ్ ఐలాండ్'పై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడి బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు ఉన్న ఆర్ట్ వర్క్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. సైనిక దుస్తుల్లో శత్రువులకు సింహస్వప్నంలా నిలిచే కమాండర్‌గా తన రూపాన్ని వర్చువల్‌గా సృష్టించి ప్రత్యర్థికి గట్టి హెచ్చరికలు పంపే యత్నం చేశారు.
పొలిటికల్ సెటైర్లు.. 2028 ప్రచార సంకేతాలు!
కేవలం యుద్ధ సంక్షోభమే కాకుండా తన ప్రత్యర్థులను ఎద్దేవా చేసేందుకు కూడా ట్రంప్ ఏఐని వాడుకున్నారు. ప్రముఖ టీవీ యాంకర్లు, సినీ, సంగీత ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ హాస్యభరితమైన పోస్టర్లను రూపొందించి పంచుకున్నారు. వీటితో పాటు 'ట్రంప్ 2028' అంటూ భవిష్యత్తులో మళ్లీ అధ్యక్ష పోటీలో ఉంటాననే రీతిలో క్యాప్షన్లతో కూడిన క్యాంపెయిన్ పోస్టర్లను వదిలారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండు దఫాలకు మించి అధ్యక్షుడిగా ఉండేందుకు అవకాశం లేనప్పటికీ, తన శైలికి తగ్గట్టుగా అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ పోస్ట్‌లు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధంలో 'ఏఐ ప్రచారం'.. కొత్త తరం సమరం!
అధికారికంగా ఎలాంటి సైనిక చర్య ప్రకటించకుండానే.. ఏఐ చిత్రాల ద్వారా శత్రు దేశాలపై మానసిక ఒత్తిడి పెంచే ఈ విధానం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త రకం సమాచార యుద్ధానికి నాంది పలికింది. విశ్లేషకులు దీనిని 'స్లాపాగ్రాండా' అని పిలుస్తున్నారు. ప్రకటనలు ఇచ్చే కంటే, కళ్లకు కట్టేలా ఉండే ఇటువంటి గ్రాఫిక్ చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయి ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ట్రంప్‌కే కాకుండా ఇరాన్ దౌత్యవర్గాలు కూడా ఏఐ వీడియోలతో కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించాయి. మొత్తానికి సాంప్రదాయ సమరానికి తోడు డిజిటల్ తెరపై ఏఐ క్రియేషన్స్ సరికొత్త సైబర్ యుద్దానికి బాటలు వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications