వారిపై క్రిమినల్ కేసులు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరిక, 8 రెస్టారెంట్స్ లైసెన్సులు రద్దు!
ఫుడ్ సేఫ్టీ.. ఇప్పుడు దేశంలో ఇదొక పెద్ద సమస్యగా మారింది. పాడైపోయిన ఆహారాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి అనేక హోటళ్ళు, రెస్టారెంట్ లు. ఈ క్రమంలో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఆహార విక్రయ కేంద్రాలపై ఫోకస్ చేశారు ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు.
హైదరాబాద్‌లో ఆహార భద్రతపై మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నగరవ్యాప్తంగా దాదాపు 200కి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తినుబండారాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు కనిపించడంతో 8 ప్రముఖ ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్ల ఫుడ్ సేఫ్టీ FSSAI లైసెన్సులను తక్షణమే రద్దు చేశారు.

తనిఖీల్లో కాలం చెల్లిన మసాలాలు, సాస్‌లు, పాడైపోయిన చికెన్, మటన్ వంటి ఆహార పదార్థాలను వంటకాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అనేక వంటశాలల్లో ఈగలు, బొద్దింకలు, మురికి నీరు కనిపించటంతో అక్కడ ఫుడ్ సేఫ్టీని అంచనా వేశారు. ఆహార పదార్థాలను మూతలు లేకుండా తెరిచి ఉంచడం, సాధారణ పరిశుభ్రత లేకపోవడం వంటి సమస్యలు గుర్తించి చర్యలు చేపట్టారు.
కొన్ని సంస్థలు FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనలకు పాల్పడిన 8 ఆహార కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, పలు ఇతర రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భారీ జరిమానాలు కూడా విధించారు. ఈ దాడులపైన స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు, వంటశాల శుభ్రత, నాణ్యమైన దినుసుల వాడకం, సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇకపై కూడా నగరంలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే సీజింగ్‌తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు బయట తినేటప్పుడు పరిశుభ్రతను గమనించాలని, ఏవైనా నాణ్యతా లోపాలు కనిపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ చర్యలు ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా ముఖ్యమైనవిగా చూడవచ్చు.













Click it and Unblock the Notifications
