బాప్ రే.. బాలాపూర్ లడ్డూ రేట్: వేలంలో ఆల్ టైమ్ రికార్డ్: నాడు రూ. 450.. నేడు..??
హైదరాబాద్ లో వినాయకుడి శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య గణేషుడి తుది వీడ్కోలు తీసుకుంటోన్నాడు. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమౌతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసాగరం అయ్యాయి. అటు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి ఎన్టీఆర్ మార్గ్ లోని ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 5 వద్ద ఈ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
అదే సమయంలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట.. భాగ్యనగర నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊహించినట్టే బాలాపూర్ లడ్డు వేలం పాట నూతన రికార్డును నెలకొల్పింది. అత్యధిక ధర పలికింది. 39 లక్షల రూపాయలకు చేరింది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట ధర. సామా ప్రణీత్ రెడ్డి దీన్ని దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నారు. వారందరికిి ధీటుగా 39 లక్షల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

గత ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు ఈ లడ్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రికార్డు చెరిగిపోయింది. బాలాపూర్ లడ్డు వేలానికి ఘన చరిత్ర ఉంది. 1994లో మొదటిసారిగా ప్రారంభమైన ఈ వేలం పాటలో కోలన్ కృష్ణారెడ్డి రూ. 450 లకే లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ మూడు దశాబ్దాల ప్రయాణంలో ఈ లడ్డు ధర లక్షల రూపాయలకు చేరుకుంది. దాన్ని పొందిన కుటుంబానికి మంచి జరుగుతందనే ప్రగాఢ విశ్వాసం భక్తుల్ల నెలకొని ఉంది.
వేలంలో గెలిచిన వారు ఈ ప్రసాదాన్ని తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచిపెట్టి ఆశీస్సులు అందుకుంటారు. దీని ద్వారా వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులుగా సమకూరుస్తారు. ఈ ఏడాది 21 కిలోల బరువు ఉన్న లడ్డూను వేలానికి పెట్టారు నిర్వాహకులు. దీని ప్రారంభ ధర రూ. 2,100 గా నిర్ణయించారు. వేలం పాట రెండు గంటల పాటు కొనసాగింది.
మరోవైపు నగరంలో భారీ ఎత్తున సిద్ధమవుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాల కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని ఇతర ప్రధాన చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం సులభంగా జరిగేలా హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికలను రూపొందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు.













Click it and Unblock the Notifications
