RBI Plastic Notes: పార్లమెంట్ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మన రోజువారీ నగదు లావాదేవీల్లో అత్యంత కీలకమైన పాలిమర్ నోట్ల ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. మార్కెట్లో అత్యధికంగా చేతులు మారే రూ. 10, రూ. 20 నోట్లలో సరికొత్త ప్లాస్టిక్ రూపాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అధికారికంగా ప్రకటించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో ఎక్కువ కాలం మన్నేలా, త్వరగా చిరిగిపోకుండా ఉండేలా దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తేవడమే ఈ వినూత్న ప్రయోగం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
ఈ సరికొత్త విధానం కింద ఆర్‌బీఐ మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో రూ. 10 విలువైనవి 100 కోట్లు, రూ. 20 విలువైనవి మరొక 100 కోట్ల నోట్లు ఉంటాయి. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అందించిన సమాచారం ప్రకారం.. ఆర్‌బీఐ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో క్రమంగా ఈ నోట్ల సరఫరాను మరింత పెంచాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

కాగితపు నోట్లు రద్దవుతాయా? కేంద్రం క్లారిటీ!
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంటే పాత కాగితపు నోట్లు చెల్లకుండా పోతాయేమోనని చాలామందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి మార్కెట్లో పాత కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయని తెలిపింది. కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద ఏదీ లేదని స్పష్టం చేసింది.
రెండో ప్రయత్నం.. ఈసారైనా సక్సెస్ అవుతుందా?
ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం ఆర్‌బీఐకి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో 2009 సెప్టెంబర్‌లో కోచి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ ప్రయత్నించింది. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రయోగం పూర్తిస్థాయికి చేరుకోలేదు. ఈసారి మాత్రం అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ ఎత్తున గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తోంది.
దీర్ఘకాల మన్నిక.. నకిలీలకు చెక్!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50కి పైగా దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ఆయుర్దాయం చాలా ఎక్కువ. తడిచినా పాడవకపోవడం, జిడ్డు లేదా మురికి పట్టకపోవడం, తేలికగా చిరిగిపోకపోవడం వీటి ప్రత్యేకత. అంతేకాకుండా వీటిని కాపీ కొట్టి నకిలీ నోట్లను ముద్రించడం అత్యంత కష్టం. ప్రస్తుతం యూపీఐ, డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ.. సామాన్యుడి చేతిలో నిత్యం నలిగే చిన్న నోట్లను సురక్షితంగా, ఎక్కువ కాలం మన్నేలా చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.












Click it and Unblock the Notifications